21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు

21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు

ఎగ్జిట్ పోల్స్​ అంచనాలకు తగ్గట్టుగానే పశ్చిమ బెంగాల్ లో దూసుకుపోతున్న  క్రమంలో బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్​ను విడుదల చేసింది. కాషాయం బీజేపీకు చేరిందని, ఇక భారత్​ అంతా మోదీ మయం అంటూ తెలిపింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాషాయం కలర్​తో చూపిస్తూ ఇండియా మ్యాప్​ను ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

“దేశ కేంద్రం (ఢిల్లీ) నుంచి బెంగాల్ వరకు, ఈ విస్తరణ కేవలం భౌగోళిక చిత్రపటంలో వ్యాప్తి మాత్రమే కాదు. ఇది ప్రగతి పథంలో పయనించాలని దృఢంగా సంకల్పించిన ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు కొనసాగుతోంది. ఇప్పటికే వేగంగా సాగుతున్న ఒక బృహత్తర గాథలో బెంగాల్​ కేవలం ఒక సరికొత్త అధ్యాయం మాత్రమే. మనమందరం కలిసి 2047లోగా వికసిత్‌ భారత్‌ను నిర్మిద్దాం” అని బీజేపీ పోస్ట్​లో రాసుకొచ్చింది.

బెంగాల్​లో విజయం సాధించడం వల్ల దేశంలో ఎన్​డీఏ పాలనలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 21కి పెరగనుంది. బెంగాల్​ విజయంతో బీజేపీ స్వతంత్రంగా పాలించే రాష్ట్రాలు 15కు చేరనున్నాయి. అదనంగా బిహార్‌లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీతో కూటమి వల్ల మొత్తం సంఖ్య 21కి చేరుతోంది. 

ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాలు ఉండగా, మెజారిటీ మార్క్ 14.5. ఈ విధంగా చూస్తే కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మిజోరం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్​డీఏ కొనసాగుతోంది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఉన్న ఇండియా కూటమి ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

తమిళనాడులో ఓటమి ఎదురైనా, కేరళలో విజయంతో కొంత ఊరట లభించింది. అయినప్పటికీ ఈ ఫలితాలు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి భవిష్యత్తుపై అనిశ్చితిని సృష్టించాయి. ఎన్నికల సంఘం ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కేవలం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనే స్వతంత్ర మెజారిటీ ప్రభుత్వాలను కలిగి ఉంది. ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కూటమిలో ఉంది. 

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్​) అధికారంలో ఉన్నప్పటికీ అది ఇండియా కూటమిలో భాగం కాదు. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి పరాజయం పాలైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (టీవీకే) పార్టీ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. 234 స్థానాల్లో 110 స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. అటు అసోంలోనూ కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ తగిలింది.

5 అసెంబ్లీలో మూడు చోట్ల బీజేపీ విజయం

ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బెంగాల్ తో పాటు అసోం, పుదుచ్చేరిలలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. బెంగాల్​లో 200 స్థానాలకు పైగా విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. అసోంలోనూ 102 సీట్లతో భారీ మెజారిటీనే సాధించనుంది. పుదుచ్చేరిలో ఎన్​డీఏనే విజయకేతనం ఎగురవేసింది. కేరళలో 140సీట్లగాను 100కుపైగా స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించింది. 

ఇక తమిళనాడులో టీవీకే హవా కొనసాగుతోంది. ఎన్​డీఏ కూటమిలోని అన్నాడీంకే కూడా ఈసారి సత్తా చాటింది. డీఎంకే, కాంగ్రెస్ అలయన్స్​కు గట్టి పోటీ ఇచ్చింది. బంగాల్​ విజయంతో కోల్‌కతాలో బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు ఝాల్‌మూరి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.