ప్రపంచంలోనే తొలి ఆప్ స్టార్ (కెమెరా, రాడార్లను కలిగిన) ఉపగ్రహం “మిషన్ దృష్టి” ప్రయోగం విజయవంతమైంది. బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ గెలాక్స్ ఐ ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కాలిఫోర్నియాలోని వందెన బర్గ్ రాకెట్ కేంద్రం నుండి ఆదివారం ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టే ఈ శాటిలైట్, ఇప్పుడు పాకిస్థాన్, చైనాలకు కొత్త తలనొప్పిగా మారబోతోంది.
190 కిలోల బరువున్న మిషన్ దృష్టి, భారతదేశంలో ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన అతిపెద్ద భూ పరిశీలన ఉపగ్రహంగా నిలిచింది. ఎలక్ట్రో ఆప్టికల్ (ఇవొ కెమెరా), సింథటిక్ అపెర్ట్యూర్ రాడార్ (ఎస్ ఎ ఆర్) సెన్సార్లను ఒకే ప్లాట్ఫామ్లో కలిపిన ప్రపంచంలోని తొలి ఉపగ్రహం ఇది. దీంతో ఈ ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, పగలు-రాత్రి నిరంతరం భూమికి సంబంధించిన స్పష్టమైన చిత్రాలను అందించగలదు. రక్షణ రంగంలో నిఘా కోసం ఇకపై విదేశీ శాటిలైట్లపై ఆధారపడాల్సిన అవసరం భారత్‌కు ఉండదు.
శత్రువుల బంకర్లు, వాహనాల కదలికలు, సరిహద్దుల్లో చొరబాట్లను ఎప్పటికప్పుడు అత్యంత కచ్చితత్వంతో దృష్టి శాటిలైట్ పసిగట్టగలదు. ఈ ఉపగ్రహం రక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి కీలక రంగాల్లో వినియోగించనున్నారు. ఇటీవల ఇస్రో పేర్కొన్న 29 క్రియాశీల భూపరిశీలన ఉపగ్రహాలతో సహా భారత ప్రభుత్వం చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు తోడ్పాటునందించనుంది.
ఇది తమ తొలి మిషన్ అని, ఐదు సంవత్సరాల పరిశోధనల్లో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశామని గెలాక్స్ ఐ వ్యవస్థాపకుడు, సిఇఒ సుయాష్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని, త్వరలో కమిషనింగ్ పూర్తి చేసి, ఫొటోలను అందిస్తామని పేర్కొన్నారు.
ఈ ఉపగ్రహం అందించే సమాచారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ , వాణిజ్య రంగాల్లో మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. గత ఐదు నుండి ఆరేళ్లుగా భారత అంతరిక్ష ప్రైవేట్ రంగంలో తీసుకున్న చర్యలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గొయెంకా పేర్కొన్నారు. మిషన్ దృష్టి వంటి ప్రాజెక్టులు భారత అంతరిక్ష రంగంపై అంతర్జాతీయంగా విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, ‘మిషన్ దృష్టి’ని గెలాక్సీఐ ప్రయోగించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది ఆవిష్కరణలు, దేశ నిర్మాణం పట్ల యువతకున్న అభిరుచికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్‌లో ప్రధాని మోదీ ఇలా అన్నారు: “గెలాక్సీఐ చేపట్టిన ‘మిషన్ దృష్టి’ మన అంతరిక్ష ప్రయాణంలో ఒక ప్రధాన విజయం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించబడటం అనేది ఆవిష్కరణలు, దేశ నిర్మాణం పట్ల మన యువతకున్న అభిరుచికి నిదర్శనం.”
మేఘాలు అడ్డుగా ఉన్నా, చీకటి ఉన్నా కూడా ‘దృష్టి’ భూమి చిత్రాలు తీయగలదు. ఆప్టికల్ శాటిలైట్లు సాధారణ సమయాల్లో హైరిజల్యూషన్ చిత్రాలను అందించగలవు. అయితే, రాడార్ శాటిలైట్లు పగటి వేళలతో పాటు రాత్రి వేళ, మబ్బులు అడ్డంగా ఉన్న సమయాల్లో కూడా భూ ఉపరితల చిత్రాలు తీయగలవు. కానీ, ఈ చిత్రాల నాణ్యత తక్కువగా ఉండటంతో శాస్త్రవేత్తలకు ఇబ్బందులు కలుగుతుంది. ఈ రెండు సాంకేతికతలను ఒకే వేదికపై తేవడం ద్వారా దృష్టి శాటిలైట్ మరింత మెరుగైన చిత్రాలను తీయగలదని గెలాక్స్ఐ పేర్కొంది.

More Stories
21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు
మమతను ఓడించిన బిజెపి… గెలుపొందిన అధికార పార్టీ బిజెపినే!
స్టాక్ మార్కెట్లలో ఎన్నికల ఫలితాల జోష్