రికార్డు స్థాయిలో ఏప్రిల్‌ జీఎస్టీ వసూళ్లు రూ.2.4లక్షల కోట్లు

రికార్డు స్థాయిలో ఏప్రిల్‌ జీఎస్టీ వసూళ్లు రూ.2.4లక్షల కోట్లు
దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను వసూళ్లు (జి ఎస్ టి ) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్ నెలకు గానూ 8.7 శాతం వృద్ధితో రూ.2.43 లక్షల కోట్ల మేర వసూళ్లైనట్లు సంబంధిత వర్గాలు  శుక్రవారం తెలిపాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశీయంగా విక్రయాలు పెరగడం, దిగుమతుల కారణంగా పన్ను వసూళ్లు ఈ స్థాయిలో పెరిగినట్లు పేర్కొన్నాయి.  
 
2025 ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లు వసూలవగా,  గత నెల కూడా జి ఎస్ టి వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దేశీయ వసూళ్లు కంటే, దిగుమతి ఆధారిత పన్నుల్లో భారీ పెరుగుదల నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 
 
అంతేకాదు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఇది తెలియజేస్తుంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల కావడంతోనూ వసూళ్లు పెరిగినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.  రిఫండ్ల సర్దుబాటు అనంతరం ఏప్రిల్ నెలకు నికరంగా జి ఎస్ టి  వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. 
 
దేశీయంగా విక్రయాల ద్వారా 4.3 శాతం వృద్ధితో రూ.1.85 లక్షల కోట్ల మేర జి ఎస్ టి ఆదాయం సమకూరిందని, దిగుమతుల రూపంలో 25.8 శాతం వృద్ధితో రూ.53,861 కోట్ల వసూళ్లు నమోదైనట్లు వెల్లడించాయి.  2026 ఏప్రిల్లో దిగుమతుల ద్వారా వచ్చే జీఎస్టీ వసూళ్లు ఏకంగా 25.8 శాతం వృద్ధితో రూ.57,580 కోట్లకు చేరుకున్నాయి. 2025 ఏప్రిల్లో నమోదైన రూ.45,754 కోట్లతో పోల్చితే ఇది 25.8 శాతం వృద్ధిని సూచిస్తుంది. 
 
ఈ 2026 ఏప్రిల్లో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల ఆదాయం 4.3 శాతం పెరిగి రూ.1,85,122 కోట్లకు చేరింది. ఈ దేశీయ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.52,140 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.61,331 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.71,651 కోట్లుగా ఉన్నాయి.  కాగా, గత నెల (2026 మార్చి) భారత స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా ఉండగా, గతేడాది ఇదే (2025 మార్చి) సమయంలో వసూలైన రూ.1,88,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8 శాతం పెరుగదల కావడం గమనార్హం. వాస్తవానికి ఏప్రిల్లో రాష్ట్రాల వారీగా చూస్తే, జీఎస్టీ వసూళ్లలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. 
జీఎస్టీ వృద్ధిలో రెండో స్థానంలో తెలంగాణ
 
 కాగా,దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. తెలంగాణలో జీఎస్టీ రాబడి వసూళ్లు గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 35 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అధిక పనితీరును వాణిజ్య పన్నుల శాఖ నమోదు చేసింది. ఏప్రిల్ 2025లో రూ.3,433 కోట్ల జీఎస్టీ రాబడి రాగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జీఎస్టీ రాబడి రూ.4,621 కోట్లుగా నమోదయ్యింది.
 
గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.1,188 కోట్ల రాబడి వాణిజ్య పన్నుల శాఖకు అధికంగా వచ్చింది. ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర (+40 శాతం), కర్ణాటక (+42 శాతం), తెలంగాణ (+36 శాతం), పుదుచ్చేరి (+108 శాతం) లాంటి రాష్ట్రాలు ఎస్జీఎస్టీ వసూళ్లు బలమైన వృద్ధిని కనబరిచాయి. కాగా లద్ధాఖ్ (-8శాతం), ఝార్ఖండ్ (0 శాతం)ల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గడం లేదా ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
ఏప్రిల్‌లో వచ్చిన రూ.4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో స్థిరమైన వృద్ధి కనిపించింది. ఉత్తరప్రదేశ్, హరియాణాలో కూడా మంచి ఫలితాలే సాధించాయి. అయితే బిహార్, అసోం, బంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో సెటిల్మెంట్కు మందు వచ్చే ఆదాయంలో క్షీణత కనిపించింది.