బెంగాల్ లో 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్…7 చోట్ల ఆంక్షలు

బెంగాల్ లో  15 పోలింగ్ కేంద్రాల్లో  రీపోలింగ్…7 చోట్ల ఆంక్షలు

పశ్చిమ బెంగాల్ లోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, అక్కడ మళ్లీ ఎన్నికలు (రీపోలింగ్) నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని ప్రకారం దక్షిణ 24 పరగణా జిల్లాకు చెందిన 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2న రీపోలింగ్ జరపాలని ఈసీ శుక్రవారం ఆదేశించింది.  దీని ప్రకారం, మగ్రాహాట్ పశ్చిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో, డైమండ్ హార్బర్లోని 4 బూత్ల్లో రీపోలింగ్ నిర్వహించున్నారు.

ఈ రీపోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవంక, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో, రెండు కౌంటింగ్ కేంద్రాల వద్ద గురువారం రాత్రి హై డ్రామా చోటుచేసుకోవడంతో, కోల్‌కతా పోలీసులు శుక్రవారం ఏడు ప్రాంతాల్లో ఆంక్షలు విధించి, ఎలాంటి సమావేశాలనైనా నిషేధించారు.

సఖావత్ మెమోరియల్ స్కూల్, కౌంటింగ్ కేంద్రం, భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వెలుపల భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 విధించారు.  కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని టీఎంసీ ఆరోపణలను తోసిపుచ్చుతూ పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు.

షహీద్ క్షుదీరామ్ బోస్ రోడ్, జడ్జెస్ కోర్ట్ రోడ్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్ రోడ్, లార్డ్ సిన్హా హాల్, నరేష్ మిత్రా సరాని (బెల్తలా రోడ్), ప్రమతేష్ బారువా సరాని వంటి ప్రాంతాల్లో ఈ నిషేధాజ్ఞలు విధించారు.  గురువారం అర్ధరాత్రి, తృణమూల్ నాయకుల ఆరోపణల నేపథ్యంలో, కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రం వెలుపల బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అంతేకాకుండా, తృణమూల్ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా కౌంటింగ్ కేంద్రం గేటు బయట నిరసన తెలిపారు.

ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేయడంతో, స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.  ఇదిలా ఉండగా, భవానిపూర్‌లోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించిన కొన్ని గంటల తర్వాత, కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగి ఉండవచ్చని ఆరోపిస్తూ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కౌంటింగ్ ప్రక్రియను తారుమారు చేసే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా హెచ్చరించారు. 

దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన తన భవానిపూర్ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో దాదాపు నాలుగు గంటల పాటు గడిపిన తర్వాత, తెల్లవారుజామున 12:07 గంటలకు బయటకు వచ్చిన మమతా బెనర్జీ, కేటాయించిన కౌంటింగ్ ప్రాంతంలోకి ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. “పై అంతస్తులో అభ్యర్థి లేదా ఒక ఏజెంట్ ఉండవచ్చు. మీడియా కోసం సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయాలని కూడా నేను సూచించాను,” అని ఆమె విలేకరులతో పేర్కొన్నారు.
ఇలా ఉండగా, ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయాన్ని సవాలు చేస్తూ టీఎంసీ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు రోజు, ఓట్ల లెక్కింపు సమయంలో కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూల) ఉద్యోగులను మాత్రమే లెక్కింపు పర్యవేక్షకులుగా నియమించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం నిష్పక్షపాతతపై ప్రశ్నలు లేవనెత్తుతుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇది సమర్థవంతంగా మినహాయిస్తుందని టీఎంసీ వాదించింది. దీనికి ముందు, టీఎంసీ కలకత్తా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఆ కోర్టు వారికి ఉపశమనం కల్పించడానికి నిరాకరించడంతో  అదే ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.