క్లైమాక్స్ కు చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు

క్లైమాక్స్ కు చేరుకున్న ఫోన్  ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీవీ ఆనంద్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపడుతూ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుందని వెల్లడించారు. ఈ కేసులో దాదాపు విచారణ పూర్తి కావచ్చిందని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారని తెలిపారు. ఈ కేసులో త్వరలోనే రెండో ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. 
 
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో వేగం పెంచినట్లు తెలిపారు.  గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడే ఆ కేసు గురించి తనకు తెలుసని చెబుతూ త్వరలో ఫోన్​ ట్యాపింగ్ కేసును సమీక్షించి తుది ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఉన్నతాధికారులతో కలిసి మరోసారి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు డీజీపీ తేల్చి చెప్పారు. 
 
కాగా, ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయిన వేళ మిగిలిన నక్సల్స్‌ కూడా జనజీవన స్రవంతిలో కలిసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ  ఆపరేషన్ కగార్ గడువు పూర్తి అయిన నేపథ్యంలో ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్ట్ నేతలు ఇప్పటికైనా ఆయుధాలను విడిచిపెట్టి తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.  ఇక ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని పునరావాస పద్ధతులను రెడీ చేసిందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సాయం అందించేలా ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.  మరీ ముఖ్యంగా లొంగిపోయిన మావోయిస్టుల జీవన స్థితిగతులను, వారికి ఎదురయ్యే ఇబ్బందులను ప్రతీ 2 నెలలకు ఒకసారి తానే స్వయంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు. తెలంగాణలో 1993 నుంచే మావోయిస్టుల పునరావాస విధానం అమలులో ఉందని గుర్తు చేస్తూ.. దాన్ని ఇప్పుడు మరింత పటిష్టం చేస్తామని తేల్చి చెప్పారు. 

శాంతి భద్రతల్లో సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని చెబుతూ  నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని ఆయన తెలిపారు. అయితే, మారుతున్న పరిస్థితుల్లానే నేరాలు జరిగే తీరులోనూ మార్పులు వస్తున్నాయని, నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ, మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారు అనుసరిస్తున్న టెక్నాలజీ పోలీసులకు కూడా సవాలు విసురుతుందని చెప్పారు.

ఐపీఎస్‌ బ్యాచ్​నకు చెందిన సీవీ ఆనంద్‌ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఇటీవలే డిజిపిగా పదోన్నతి పొందారు. గతంలో ఆయన పోలీస్ ​శాఖలోని పలు కీలక విభాగాల్లో సేవలందించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు విడతల్లో పనిచేశారు. ఇంతవరకు డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి పదవీకాలం గురువారంతో ముగియడంతో సీవీ ఆనంద్​ను ప్రభుత్వం నూతన పోలీస్​ బాస్​గా నియమించింది.