అత్యాచార బాధితుల గర్భస్రావం చట్టం సవరించాలి

అత్యాచార బాధితుల గర్భస్రావం చట్టం సవరించాలి
అత్యాచార బాధితుల గర్భస్రావానికి సంబంధించిన చట్టాన్ని  సవరించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   అత్యాచారం కారణంగా గర్భం దాల్చినప్పుడు, అబార్షన్‌ చేయించుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితి అనేది ఉండకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టం ఉండాలని తెలిపింది. 

30 వారాల (ఏడున్నర నెలల) గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవడానికి 15 ఏళ్ల బాలికకు అనుమతులిస్తూ ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే  ఈ దశలో బాలిక గర్భాన్ని తొలిగిస్తే ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని  పేర్కొంటూ ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాము ఎంతో ఆవేదనతో ఈ క్యూరేటివ్ పిటిషన్‌ను వేస్తున్నామని, ఈ దశలో గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదని  ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే ఆ మైనర్ తల్లి ఆరోగ్యంపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉందని, డెలివరీకి ఇంకా నాలుగు వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి, దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలింవచ్చని ప్రతిపాదించింది. 

ఇదంతా ఆ బాధిత బాలిక క్షేమం కోసమేనని ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ ఐశ్వర్య భాటి కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ ఇది బాలికపై అత్యాచారం జరిగిన కేసు అని, ఆ ఘటన తాలూకు క్షోభ ఆమెను జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకోవాలని సూచించింది. 

ఒకవేళ ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే గర్భవిచ్ఛిత్తిని నిర్వహించాలని చెప్పింది. గర్బవిచ్ఛిత్తివల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, వారు తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయాలని సూచించింది. అందుకే ఈ విషయంలో నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నామని పేర్కొన్నది. 

అత్యాచార కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచనలు చేసింది. 20 వారాలు దాటిన తర్వాత కూడా అత్యాచార బాధితులు అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేలా చట్టంలో సవరణ చేయాలని సూచించింది.