మదర్సా బోర్డు రద్దు చేసిన ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి మదర్సాలు రద్దవుతాయి. కొత్త నిబంధన ప్రకారం గుర్తింపు కలిగిన మదర్సాలను ఇకపై సాధారణ పాఠశాలలుగా పరిగణిస్తారు. ఈ మదర్సాలన్నీ రాష్ట్ర మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అథారిటీ కిందికి వస్తాయి. 
 
మదర్సాలను పాఠశాలలుగా గుర్తిస్తూ, వీటికి సంబంధించిన ప్రణాళికలు, పాఠ్యాంశాలు, పరిపాలన, గుర్తింపు వంటి వాటిని పర్యవేక్షించే బాధ్యత ఈ అథారిటీలదే. దేశంలో మదర్సా బోర్డును రద్దు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అంతేకాదు వీటిని సాధారణ పాఠశాలలులాగా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై మదర్సాలు సాధారణ విద్యా వ్యవస్థలోకి వస్తాయి. 
 
మతపరమైన బోధన ఒక్కటే ఈ తరానికి సరిపోదని, ఆధునిక విద్యా ప్రమాణాలు అందితేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావించింది. ఇకపై రిజిష్టర్డ్ మదర్సాల్లో సాధారణ సిలబస్‌నే బోధించాలి. ఇతర పాఠశాలల్లోలాగే విద్య అందించాలి. పాఠశాలలకు వర్తించే ఇతర నిబంధనలే మదర్సాలకు కూడా వర్తిస్తాయి. ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ సిలబస్ ఫాలో కావాలి. 
 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల ఆధునిక సబ్జెక్టులను బోధించాలి. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వంటివి చదువుకోవాలి. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుంటే, సరైన విద్యా బోధన చేయకుంటే ప్రభుత్వం అలాంటి మదర్సాలపై చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనుమతి లేకుండా 500 వరకు మదర్సాలు ఉన్నట్లు లెక్క. ఇకపై వీటికి అనుమతి పొందకపోయినా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేకుండా ఉన్నా వాటిని మూసేస్తారు.

About The Author