భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ ధర

భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ ధర

* నయారా ఎనర్జీ పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.3 ధర తగ్గింపు 

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ను వినియోగించే వారికి చమురు కంపెనీలు ఊరట కల్పించాయి. 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి. ఇవాళ్టి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్‌పై రూ.183.50 మేర ధర తగ్గింది. దాంతో అక్కడ సిలిండర్ ధర రూ.3,113.50 నుంచి రూ.2,930 కి చేరింది.

ఇప్పటికే హోటళ్లు, రెస్టారంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్‌ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం తొలగించింది. యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంక్షలను సడలించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే వివరించింది.

కోల్‌కతాలో రూ.174 తగ్గడంతో ధర రూ.3,081.50కి, చండీగఢ్‌లో రూ.181.50 తగ్గింపుతో రూ.2,954.50కి, పట్నాలో రూ.173 తగ్గింపుతో రూ.3,227కి ధరలు దిగివ‌చ్చాయి. అదేవిధంగా హైద‌రాబాద్‌లో రూ.176 త‌గ్గి సిలిండ‌ర్ ధ‌ర రూ.3,191కి చేరింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడమే ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

అయితే, గృహ వినియోగదారులకు మాత్రం 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.942, కోల్‌కతాలో రూ.968, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50, హైద‌రాబాద్‌లో రూ.994 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

కాగా, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ చమురు రిటైల్‌ సంస్థ ‘నయరా ఎనర్జీ’ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై 5రూపాయలు, డీజిల్‌పై 3రూపాయల చొప్పున తగ్గించింది. నాయరా ఎనర్జీకి దేశవ్యాప్తంగా 7వేలకుపైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. స్థానిక పన్నుల ఆధారంగా కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

 
ఇరాన్‌ యుద్ధం మొదలైన తర్వాత మార్చి 26న లీటర్‌ పెట్రోల్‌పై 5, డీజిల్‌పై 3 రూపాయల చొప్పున పెంచింది. గుజరాత్‌లోని వాడినార్‌లో ఏడాదికి 20మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆయిల్ రిఫైనరీని నాయరా ఎనర్జీ నిర్వహిస్తోంది.