చమురు కొరతతో ఇబ్బంది పడుతున్న భారత్ కు ప్రత్యేక మార్గంలో చమురు సరఫరా చేయాలని యూఏఈ నిర్ణయించింది. చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య అయిన ఒపెక్ నుంచి బయటకు వచ్చిన యూఏ ఇకపై చమురు సరఫరా విషయంలో యూఏఈ స్వతంత్రంగా వ్యవహరించనుంది. దీనిలో భాగంగానే భారత్ కు భారీ స్తాయిలో, ప్రత్యేక మార్గంలో చమురు సరఫరా చేయాలని నిర్ణయించింది.
చమురు ఉత్పత్తి చేసే ఒపెక్ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్లు మంగళవారం యూఏఈ ప్రకటించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అంటే, ఇకపై చమురు ఉత్పత్తి, రవాణా, సరఫరా వంటి విషయాలలో ఒపెక్ నిర్ణయాలు, కట్టుబాట్లతో యూఏఈకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ అంశంలో గతంలో సౌదీ అరేబియా రూపొందించిన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉండదు. ఒపెక్ నుంచి బయటకు రావడం వల్ల యూఏఈ తన సామర్ధ్యానికి తగ్గట్లుగా చమురు ఉత్పత్తి చేస్తుంది.
అలాగే, ఒపెక్ గ్రూపునకు ప్రత్యేకంగా చమురు కేటాయించాల్సిన అవసరం లేదు. గతంలో యూఏఈ ఎంత చమురు ఉత్పత్తి చేయాలో ఒపెక్ నిర్ణయించేది. యూఏఈ చమురు ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఒపెక్ రోజుకు 3.4 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే, అంతకంటే ఎక్కువే ఉత్పత్తి చేయగల సామర్ధ్యం యూఏఈకి ఉంది. మార్కెట్లోకి చమురు ఎక్కువగా ఉత్పత్తి అయితే, ధరలు తగ్గుతాయని ఒపెక్ ఈ నియంత్రణ విధించింది.
కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని యూఏఈ భావిస్తోంది. ఇకపై రోజూ 4.8 మిలియన్ బ్యారెళ్ల నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉత్పత్తి చేయాలని యూఏఈ నిర్ణయించింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇరాన్ దిగ్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్ముజ్ బైపాస్ మార్గం ద్వారా, హబ్సన్–ఫ్యుజైరా పైప్ లైన్ మార్గం ద్వారా భారత్ కు చమురును సరఫరా చేయాలని యూఏఈ నిర్ణయించింది.
భారత్ కు కూడా ఈ మార్గం చాలా ఉపయోగకరం. భారత కంపెనీలు ఇక్కడి నుంచి చమురు తీసుకెళ్లడం సులభమవుతుంది. ఇదే జరిగితే భారత్కు మరింత మేలు జరుగుతుంది. చమురు ఇంకా అందుబాటులోకి వస్తుంది. భారత్ తనకు అవసరమైన చమురు ఉత్పత్తిలో 9–10 శాతం యూఏఈ నుంచే దిగుమతి చేసుకుంటోంది. యూఏఈ నిర్ణయం వల్ల దేశానికి ఎల్‌ఎన్‌జీ సరఫరా మెరుగవుతుంది.

More Stories
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదు
పెరిగిన ఇంధనం ధరలతో విమానాలు నడపలేం!
డిజిటల్ అరెస్టు మోసాల కట్టడికి బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్