ఏపీలో పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు

ఏపీలో పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు
ఏపీలో పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరడంతో ఆదివారం కలకలం చెలరేగింది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, తిరుపతి, కడప జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా కనిపించింది.  దానితో రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 
 
ముంబయి నుంచి అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులతో సిఎం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్‌ బంకులు ఉండగా, పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా ప్యానిక్‌ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
 
నగరాలు, పట్టణాల్లో ప్రజలు భయాందోళనలతో ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు.  ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసి, తీసుకున్న చర్యలపై సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రమవుతుందని, ఇంధన కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియాలో ఆందోళనకరమైన పోస్టులు రావడంతో వారాంతంలో ప్రజలు భయాందోళనలతో ఇంధనాన్ని కొనుగోలు చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పలు ప్రాంతాల్లో వేలాది మంది పెట్రోల్ బంకుల బయట బారులు తీరి, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు.

సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్‌, 9,048 కిలో లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతాయని అధికారులు వివరించారు. కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని తెలిపారు. శనివారం 10,345 కిలో లీటర్ల పెట్రోల్‌.. 14,156 కిలో లీటర్ల డీజిల్‌ అమ్మకం జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50 శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని, అధికారులు వివరించారు.

 
ఆక్వారైతులు డ్రమ్ముల్లో కొనుగోళ్లు జరుపుతారని వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని చెప్పారు.  సిఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, కమిషనర్‌ కన్నబాబు చమురు కంపెనీలు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇబ్బంది సమయంలో కంపెనీలు సమర్థంగా పని చేయాలని చెబుతూ ఎక్కడా సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని,  కొరత సృష్టించి వినియోగదారులకు అసౌకర్యం కలిగించడం తగదని స్పష్టం చేశారు.