తెలంగాణలో తొలి విడత జనగణన ఆదివారం నుంచి ప్రారంభమైంది. అందులో భాగంగా స్వీయగణన నమోదుకు అవకాశం కల్పించారు. మే 10వ తేదీ వరకు అంటే పక్షం రోజుల పాటు ప్రజలు తమ వివరాలను ఆన్లైన్లో స్వయంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చునే ఈ వివరాలు ఎలా నమోదు చేసుకోవచ్చనే వివరాలపై ఆయా జిల్లా యంత్రాంగాలు ఇప్పటికే అవగాహన కల్పించాయి.
జనగణనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్వీయగణనలో తన వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా తెలంగాణాలో జనగనను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుని తమ వివరాలు నమోదు చేశారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు గణనపై శిక్షణను ఇస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లను వినియోగిస్తున్న వారు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు అధికారులు అవకాశం కల్పించారు. జనగణనలో మొత్తం 33 ప్రశ్నలుంటాయి. స్వీయ గణనలో 27 ప్రశ్నలకు జవాబులను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 ప్రశ్నలకు సమాధానాలను ఇంటి వద్దకు వచ్చే జనగణన అధికారి (ఎన్యుమరేటర్) ఎంటర్ చేస్తారు. ఎన్ని ఆస్తులున్నాయి?, ఎక్కడెక్కడ ఉన్నాయనే ప్రశ్నలు లాంటివి ఉండవు.
ఇంటి నంబర్లు, ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల ప్రస్తావన ఉండదు. ఇల్లు, సౌకర్యాలు, కులం తదితర వివరాలను మాత్రమే తెలపాల్సి ఉంటుంది. మొదటి దశలో కేవలం ఎస్సీ (షెడ్యూల్డ్ క్యాస్ట్), ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) కులాల నమోదు ఉంటుంది. ఆ రెండు కేటగిరీల్లో లేని వారిని ఇతరులుగా పరిగణిస్తారు. ‘ఇతరుల’ కులాన్ని రెండో దశ జనగణనలో నమోదు చేస్తారు.
జనగణన అధికారులు ఇంటికి వచ్చి అడిగే సాధారణ ప్రశ్నలకూ సమాధానమివ్వనట్లయితే చట్ట ప్రకారం జరిమానా విధింపు, ఇతర చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్వయంగా ప్రజలే తమ వివరాలను నమోదు చేసుకునే విధంగా స్వీయగణన విధానం తీసుకొచ్చింది. ఇంట్లోని కుటుంబసభ్యుల వివరాలను మీరే నేరుగా ఆన్లైన్ విధానంలో నమోదు చేయొచ్చు. దీంతో ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, నిత్యం దూర ప్రాంతాలకు విధులకు వెళ్లి వచ్చేవారికి సమయం ఆదా కావడం మాత్రమే కాకుండా కచ్చితమైన సమాచారం కూడా నమోదవుతుంది.
స్వీయ గణనను చివరకు ఎన్యుమరేటర్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్వీయగణన పూర్తయ్యాక మీకు ఒక నంబర్ వస్తుంది. దానిని జనాభా లెక్కలకు వచ్చే అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ వివరాల నమోదు
- ముందుగా https://se.census.gov.in/ వెబ్పోర్టల్ను సందర్శించాలి.
- రాష్ట్రం ఎంచుకుని క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి.
- కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబరు నమోదు చేయాలి
- ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే వాడాలి
- ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది
- మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి
- మీ మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి
- మీ జిల్లా, పిన్కోడ్, గ్రామం, పట్టణం వివరాలు ఎంపిక చేసుకోవాలి.
- రెడ్ మార్క్ను కచ్చితంగా మీ ఇల్లు ఉన్న చోటికి డ్రాగ్ చేయండి
- ఇళ్ల జాబితా ప్రశ్నలన్నింటినీ పూర్తి చేయండి
- వివరాలు ఎంటర్ చేశాక ప్రివ్యూ చేయండి
- అనంతరం వెరిఫై, ప్రొసీడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి
- పైనల్ సబ్మిట్ మీట నొక్కితే హెచ్ అక్షరంతో మొదలయ్యే 11 అంకెల విశిష్ఠ సంఖ్య (ఎస్ఈ ఐడీ) వస్తుంది. ఆ సంఖ్యను రాసుకుని సెన్సస్ సిబ్బంది వచ్చినప్పుడు దాన్ని చూపిస్తే వివరాలు ధ్రువీకరించి గణన ప్రక్రియ పూర్తి చేస్తారు.
- వారు ఐడీ నమోదు చేసినప్పుడు డేటా మ్యాచ్ అయితే మీ స్వీయ జనగణన పూర్తయినట్లు లెక్క.

More Stories
ఆప్ ఎంపీల ఫిరాయింపు ఆ పార్టీ విచ్ఛిన్నంకు నాంది?
అముద్రిత పుస్తకంపై అనవసరంగా వివాదంలోకి లాగారు!
మొదటి దశలో టీఎంసీ అహంకు దెబ్బ, రెండో దశలో బిజెపి విజయం