* లైంగిక వేధింపులు, లవ్ జిహాద్ లకు నిరసనగా హైదరాబాద్ టిసిఎస్ వద్ద మహిళల భారీ ధర్నా
నాసిక్ లోని టిసిఎస్ హిందూ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, కుట్రపూరితంగా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు, వారిని మతమార్పిడికి వత్తిడులకు గురిచేయడం దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్ లోని టిసిఎస్ కార్యాలయం వద్ద “మహిళా సురక్ష వేదిక” ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మహిళలు పెద్ద ఎత్తున ఈ విషయమై తమ ఆందోళనలు వ్యక్తం చేస్తూ శాంతియుతంగా భారీ ధర్నా నిర్వహించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటి కార్పొరేట్ వేధింపులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పరచాలని మహిళా సురక్ష వేదిక డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ)ల పనితీరుపై నివేదిక సమర్పించమని ప్రభుత్వం ఆదేశించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన `షీ బాక్స్’ వంటి ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను ప్రతి ఐటీ కంపెనీలో తప్పనిసరి అందుబాటులోకి తీసుకు వచ్చి, బాధితులు భయం లేకుండా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించాలని స్పష్టం చేశారు. ఐటీ కారిడార్‌లో హిందూ మహిళా ఉద్యోగులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, ‘లవ్ జిహాద్’ పేరిట సాగుతున్న భావోద్వేగ మోసాలకు వ్యతిరేకంగా వందలాది మంది మహిళలు ఏకమై నిరసన వ్యక్తం చేశారు.
సాఫ్ట్ వేర్ కంపెనీలు హిందూ మహిళల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మహిళలు ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. విశాఖ కేసు తీర్పులో 2013లో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని, పోష్ చట్టాన్ని అమలు చేయడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీటి ప్రకారం ప్రతి కార్యాలయంలో మహిళలకు రక్షణ కల్పించడం యాజమాన్యాల ప్రాథమిక బాధ్యత అని మహిళలు గుర్తు చేశారు.
వీటి చేయడంలో నాసిక్ టీసీఎస్ ఘోరంగా విఫలమైందని, 2022 నుండే బాధితులు తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సిన హెచ్ఆర్ విభాగం ప్రేక్షక పాత్ర వహించడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం సంస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని సడలిస్తోందని వారు స్పష్టం చేశారు.
చట్టం ప్రకారం ప్రతి కంపెనీలో తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఉండాలని, ఈ కమిటీ మహిళల ఫిర్యాదులను స్వీకరించి, గరిష్టంగా 90 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలని తెలిపారు. అయితే, పలు కంపెనీలలో అటువంటి కమిటీల ఉనికి, వాటి పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కార్పొరేట్ యాజమాన్యాలు తమ ప్రతిష్ట కోసం వాస్తవాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వేధింపులను కేవలం ప్రేమ వ్యవహారంగా చూడలేమని, ఒక పద్ధతి ప్రకారం సాగుతున్న భావోద్వేగ మోసం అని స్పష్టం చేశారు.
ముఖ్యంగా హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారిని మానసికంగా లొంగదీసుకుని బాధితులుగా మారుస్తున్నారని పేర్కొంటూ సాఫ్ట్‌వేర్ వంటి ఉన్నత రంగాల్లో కూడా ఇలాంటి ‘ట్రాపింగ్’ జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత అనేది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, అది సమాజ నైతిక బాధ్యత అని పేర్కొంటూ కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల వేటలో మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టకూడదుని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More Stories
పాక్ లో మతమార్పిడి బాధితుల్లో 75శాతం హిందూ బాలికలే
అమెరికా- ఇరాన్ చర్చల్లో ప్రశ్నార్ధకంగా పాకిస్తాన్ దౌత్యం!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం