వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనాల మధ్య ప్రస్తుత పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. ఇంకా సున్నితంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అయితే, స్థిరత్వం అంటే అలసత్వం కాదని, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయి సన్నద్ధతో సైన్యం మోహరింపు కొనసాగిస్తున్నామని ద్వివేది చెప్పారు.
మంగళవారం పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉత్తర సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయని, ఇరు పక్షాలూ ఒకరి ఆందోళన పట్ల మరొకరు మరింత సానుకూలంగా స్పందిస్తున్నారని వివరించారు. ‘‘ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉన్నా అత్యంత సున్నితమై. సైన్యాల ఉపసంహరణ ఒప్పందం కారణంగా క్షేత్రస్థాయిలో స్థిరత్వం పెరిగింది. ఏడాది కాలంగా పునరుద్దరించిన దౌత్య, సైనిక చర్చలు ఉద్రిక్తతలు తగ్గించడానికి, రోజువారీ సరిహద్దు నిర్వహణ సమస్యల పరిష్కారానికి, పరస్పర నమ్మకం పెంపొందించడానికి సహాయపడ్డాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
సరిహద్దుల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకుంటున్నాయనడానికి పలు దౌత్యపరమైన చర్యలు సానుకూల ఫలితాలు ఇసతున్నాయని ఆర్మీ చీఫ్ తెలిపారు. ‘‘వీటిలో సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పరిశీలనకు సంప్రదింపులు సమన్వయం కోసం పని చేసే యంత్రాంగం పరిధిలో ఒక నిపుణుల బృందం ఏర్పాటు, కైలాష్ మానససరోవర్ యాత్ర, నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, మూడు కనుమలద్వారా సరిహద్దు వాణిజ్యానికి ఏకాభిప్రాయం, వీసా సడలింపు చర్యలు’’ ఉన్నాయని ఆయన చెప్పారు.
‘‘ఇరుపక్షాల మధ్య ఏటా 1100 కంటే ఎక్కువ క్షేత్రస్థాయి చర్చలు జరుగుతాయి. ఇవి హాట్‌లైన్లు, ఫ్లాగ్ మీటింగ్‌లు, కమాండర్ స్థాయి చర్చల ద్వారా స్థానిక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతున్నాయి. అయినప్పటికీ, భారత సైన్యం అలసత్వానికి తావివ్వడం లేదు. కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర అనుబంధ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు.
‘‘స్థిరత్వం అంటే నిర్లక్ష్యం కాదు. ఎలాంటి ముప్పునైనా నివారించడానికి, ఏ ఆకస్మిక పరిస్థితికైనా స్పందించడానికి భారత సైన్యం పటిష్టమైన మోహరింపు స్థితిని కొనసాగిస్తోంది. ఉత్తర సరిహద్దుల వెంబడి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిఘా, లాజిస్టిక్స్, మొబిలిటీ, సామర్థ్య పెంపు ప్రాధాన్యతగా ఉన్నాయి. సాధారణ సరిహద్దు నిర్వహణ నుంచి ఏదైనా కార్యాచరణ సవాలు వరకు మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన వివరించారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా మౌలిక సదుపాయాల అభివృద్ధి పెరుగుతున్న విషయంపై ప్రస్తావిస్తూ “పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ & కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. ఇది మన స్పష్టమైన, స్థిరమైన జాతీయ వైఖరి. సైనిక దృక్కోణం నుండి చూస్తే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కొనసాగించడానికి, శిక్షణ ఇవ్వడానికి, దాడులను ప్రారంభించడానికి, జమ్మూ & కాశ్మీర్‌లోకి చొరబాటుకు మద్దతు ఇవ్వడానికి పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను నిరంతరం ఉపయోగించడం మన తక్షణ ఆందోళన” అని తెలిపారు.
“ఇది ఒక సజీవ భద్రతా సవాలుగా మిగిలి ఉంది. దీనిని మా కార్యాచరణ ప్రణాళిక, సంసిద్ధతలో పరిగణనలోకి తీసుకుంటాము. భారతదేశ భద్రతపై ప్రభావం చూపే బాహ్య సైనిక, మౌలిక సదుపాయాల కార్యకలాపాలతో సహా, ఈ ప్రాంతం విస్తృత వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి కూడా మేము స్పృహతో ఉన్నాము. భారత సైన్యం అటువంటి అన్ని పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఆకస్మిక పరిస్థితికైనా స్పందించడానికి సిద్ధంగా ఉంటుంది. మా మోహరింపు, నిఘా, ఇంటెలిజెన్స్ గ్రిడ్, కార్యాచరణ సంసిద్ధతను తదనుగుణంగా నిర్వహిస్తాము,” అని ఆయన పేర్కొన్నారు.
More Stories
32 ఏళ్ల తర్వాత యమునా జలాల ఒప్పందం
ఢిల్లీలో విద్యుత్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు
అమెరికాకు ‘కమ్యూనిజం’ అతిపెద్ద ముప్పు… ట్రంప్