ఢిల్లీలో కొనుగోలు చేసే అన్ని రకాల ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి వంద శాతం పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఫోర్ వీలర్ల కేటగిరీలో ఈ పన్ను మినహాయింపు కేవలం రూ.30 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్ ధర) ఉండే ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
జాతీయ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి జీరో ఎమిషన్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి సోమవారం ‘ఢిల్లీ ఈవీ పాలసీ 2026’ను ప్రకటించారు. జూలై 1న అమల్లోకి వచ్చి, 2030 మార్చి 31 వరకు అమలులో ఉండే ఈ పాలసీకి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా నుండి త్వరలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది.
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తన ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో దాదాపు రూ. 7,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని సీఎం గుప్తా తెలిపారు. అంతేకాకుండా, రూ. 8,000 కోట్ల విలువైన పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను ఈవీ వినియోగదారులకు అందజేస్తామని ఆమె ప్రకటించారు. “పన్ను మినహాయింపులు, ఈవీ మౌలిక సదుపాయాలతో సహా సుమారు రూ. 15,000 కోట్ల మొత్తం ప్రయోజనాలు పౌరులకు చేకూరుతాయి,” అని ఆమె చెప్పారు.
జీరో ఎమిషన్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా నగరాన్ని కాలుష్య రహిత, స్వచ్ఛమైన రవాణా రాజధానిగా మార్చడం, రాజధానిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో సహాయపడటమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను మాత్రమే రిజిస్టర్ చేస్తారు. ఏప్రిల్ 1, 2028 నుండి పెట్రోల్, సీఎన్‌జీతో నడిచే ద్విచక్ర వాహనాలను దశలవారీగా నిలిపివేస్తారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులు మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలలో వరుసగా రూ. 30,000, రూ. 20,000, రూ. 10,000 సబ్సిడీలను పొందుతారు. ఇదే కాలంలో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల కొనుగోలుదారులు రూ. 50,000, రూ. 40,000, రూ. 30,000 ప్రోత్సాహకాలకు అర్హులు. అందుకు మద్దతుగా, ఢిల్లీ ప్రభుత్వం నగరం అంతటా సుమారు 32,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఈవీ ప్రోత్సాహకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ కూడా ప్రారంభిస్తుంది.
ఈ పాలసీలో అత్యంత ఆకర్షణీయమైన అంశం పాత బిఎస్-IV లేదా అంతకంటే పాత వాహనాల స్క్రాపేజ్ విధానం. ఎవరైనా తమ పాత వాహనాన్ని వదిలేసి, కొత్త వాహనాన్ని (ఈవీ) కొనుగోలు చేస్తే, సాధారణ సబ్సిడీలతో పాటు అదనంగా స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తుంది. పాత కారును మార్చి కొత్త ఈవీ కార్ కొంటే రూ.1,00,000 స్క్రాపేజ్ బోనస్, కమర్షియల్ ట్రక్కులకు గరిష్టంగా రూ.50,000 వరకు ప్రయోజనం కల్పిస్తారు. త్రీ వీలర్లు (ఆటోలు)కు రూ.25,000 స్క్రాపేజ్ ప్రోత్సాహం, టూ వీలర్లు (బైకులు/స్కూటర్లు)కు రూ.10,000 అదనపు లబ్ధి చేకూరుస్తారు.

More Stories
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్రం
32 ఏళ్ల తర్వాత యమునా జలాల ఒప్పందం
చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు స్థిరం, సున్నితం