వేసవి రద్దీకి 18వేల సమ్మర్ స్పెషల్ రైళ్లు

వేసవి రద్దీకి 18వేల సమ్మర్ స్పెషల్ రైళ్లు
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి భారతీయ రైల్వే శాఖ ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండటంతో, ప్రయాణం సుఖమయం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వేసవి సీజన్‌లో రికార్డు స్థాయిలో 18,262 ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 
 
గత ఏడాదితో పోలిస్తే ఈసారి సర్వీసుల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఇందులో ఇప్పటికే 11,878 ట్రిప్పులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.  ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఉత్తర-దక్షిణ భారతదేశాలను అనుసంధానించే మార్గాల్లో మరిన్ని రైళ్లను కేటాయించారు.
 
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు ఈ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్టేషన్లలో మంచినీటి సౌకర్యం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం అదనపు సిబ్బందిని మోహరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాన రైల్వే జంక్షన్లలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లను పర్యవేక్షించనున్నారు.  దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
బెంగళూరు, హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల నుండి ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడం, సూరత్, అహ్మదాబాద్, పుణె వంటి పారిశ్రామిక నగరాల నుండి కార్మికులు, కుటుంబాల కోసం అదనపు కోచ్‌ల ఏర్పాటు చేయడం చేస్తున్నారు.  వేసవి రద్దీ సమయంలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఇబ్బందుల్లేని ప్రయాణాన్ని అందించడమే భారతీయ రైల్వే లక్ష్యమని అధికారులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, సమర్థవంతమైన నిర్వహణ, తక్షణ స్పందనతో ప్రయాణికుల సేవలను మరింత మెరుగుపరచేందుకు రైల్వే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.