చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రత ముప్పు

చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రత ముప్పు

చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఎరుగని అతిపెద్ద ఇంధన భద్రత ముప్పును ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ తరుణంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని,  తద్వారా తమతమ ఆర్థిక స్థితిగతులు గాడి తప్పకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు. 

సింగపూర్‌లో జరిగిన ఓ ఇంధన రంగ సదస్సును ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ  ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇప్పటిదాకా అంతర్జాతీయ మార్కెట్ ప్రతిరోజు సగటున 13 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నష్టపోయిందని తెలిపారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కీలక సరుకుల సరఫరాలోనూ అవాంతరం ఏర్పడిందని ఆయన చెప్పారు.  

అమెరికా – ఇరాన్ సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, హర్మూజ్ జలసంధి మూతపడటం అనే అంశాలు ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని అతిపెద్ద ఇంధన సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నాయి. ఈ సంక్షోభం వివిధ విద్యుత్ రంగాల దిశగా మారిపోయే ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేస్తుంది” అని ఆయన తెలిపారు.  తొలుత అణు విద్యుత్ రంగం విస్తరించే అవకాశాలు పెరుగుతాయని, సౌర విద్యుత్, పవన విద్యుత్, ఇతరత్రా రకాల విద్యుత్ తయారీ రంగాలు చాలా వేగంగా పురోగతిని సాధిస్తాయని చెప్పారు.

తాజా పరిణామాలతో ఎలక్ట్రిక్ కార్ల విభాగం కూడా ప్రయోజనాన్ని పొందనుందని ఫాతిహ్ బిరోల్ అంచనా వేశారు. ముడి చమురు సరఫరాలపై ప్రస్తుతమున్న ఒత్తిడి అనేది సాంప్రదాయ శిలాజ ఇంధనాల తాత్కాలిక పునరుజ్జీవనానికి దారితీయొచ్చని కూడా తెలిపారు. ముఖ్యంగా ఆసియాలోని కొన్ని పెద్ద దేశాలలో బొగ్గు ధరలు మళ్లీ పెరగొచ్చని పేర్కొన్నారు. 

“ఇంధన రంగంలో ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభానికి హర్మూజ్ జలసంధే ప్రధాన కారణం. అమెరికా, ఇరాన్ దేశాల వల్ల ఇప్పుడిది డబుల్ ముట్టడిలో ఉంది. ఈ రెండు దేశాలూ హర్మూజ్ మీదుగా చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదు. దాని మూసివేత కొనసాగితే ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వాటి ఆర్థిక వికాసం మందగిస్తుంది” అని హెచ్చరించారు. 

“చాలా దేశాలు ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటాయి. విమానయాన రంగం సైతం ఈ ప్రభావానికి లోనవుతుంది. ఐరోపా దేశాలకు విమాన ఇంధన కొరత రూపంలో పెద్ద ముప్పు పొంచి ఉంది. ఐరోపా దేశాలు వినియోగించే విమాన ఇంధనంలో దాదాపు 75 శాతాన్ని పశ్చిమాసియా దేశాలే సరఫరా చేస్తున్నాయి అని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ చెప్పారు.

అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును 32 దేశాల ఐఈఏ కూటమి ఇప్పటికే విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. రెండో విడతగా అత్యవసర చమురు నిల్వలను విడుదల చేసే అంశంపైనా ఐఈఏలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.  అయితే దీనివల్ల శాశ్వత పరిష్కారం లభించదని, తాత్కాలిక ఊరటకు మాత్రమే ఈ నిల్వలు పనికొస్తాయని చెప్పారు. ప్రపంచానికి పూర్తిస్థాయి ఊరట లభించాలంటే హర్మూజ్ జలసంధిని తెరిచే పరిస్థితులు ఏర్పడాలని ఐఈఏ చీఫ్ స్పష్టం చేశారు.