కాంగ్రెస్ మహిళా వ్యతిరేకత నిరసిస్తూ `మహిళా ఆగ్రహ యాత్ర’

కాంగ్రెస్ మహిళా వ్యతిరేకత నిరసిస్తూ `మహిళా ఆగ్రహ యాత్ర’
కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం  హైదరాబాద్ లో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ ఉవ్వెత్తున ఎగిసింది. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు విజయవంతంగా కొనసాగిన ఈ భారీ పాదయాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొని కాంగ్రెస్ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.

బీజేపీ మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, సామాన్య మహిళామణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్లను ఏ విధంగా అడ్డుకుందో వివరిస్తూ నినాదాలు చేశారు. దారి పొడవునా కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనలను ఎండగడుతూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మారిస్తే కాంగ్రెస్ మాత్రం దానిపై రాజకీయం చేస్తూ అడ్డుకుందని నేతలు విమర్శించారు. యాత్ర ముగింపులో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన సభలో మహిళా నాయకులు ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. మోదీ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చేపట్టిన చారిత్రాత్మక పథకాలను వివరిస్తూనే మహిళా రిజర్వేషన్లకు గండికొట్టిన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. నారీ శక్తి ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అంతర్థానం కావడం ఖాయమని హెచ్చరించారు.

ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న మహిళా నాయకులు మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ తీసుకువచ్చి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే, దానిని కూడా రాజకీయం చేస్తూ అడ్డుకున్న ఘోర చరిత్ర కాంగ్రెస్ మరియు ఇండీ కూటమిది. మహిళా శక్తి ఎదగడం ఇష్టం లేని కాంగ్రెస్ డీలిమిటేషన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని మహిళల అభివృద్ధిని కాలరాస్తోందని మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళా వ్యతిరేక శక్తులని మండిపడ్డారు. తెలంగాణలో తొలిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రికి కూడా చోటు కల్పించని చరిత్ర వారిదని గుర్తు చేశారు. నేడు రాజకీయ ఉనికి కోసం మహిళా బిల్లును అడ్డుకుంటూ ఈ అంశాన్ని ఉత్తర-దక్షిణ భారతాల మధ్య విభజన రాజకీయంలా మార్చడం దారుణమని ధ్వజమెత్తారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 17వ తేదీని దేశ చరిత్రలో మహిళా లోకానికి జరిగిన అవమానకరమైన ‘చీకటి రోజు’గా  అభివర్ణించారు. ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తే ఆ బిల్లును అడ్డుకుని, కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లోపల, బయట సంబరాలు చేసుకోవడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి కోసం మహిళా రిజర్వేషన్లను, డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకుంటూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఈ నేతలందరూ ప్రజలకు జవాబుదారీగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నారీ శక్తికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ నాయకులకు రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప ఫార్ములాతో, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో ఎలాంటి అన్యాయం జరగకుండా, దేశమంతా సమన్యాయం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా వేలాది మంది మహిళలకు, యువతకు రాజకీయ అవకాశాలు లభిస్తే తమ ఉనికి ఎక్కడ కోల్పోతామో అన్న భయంతోనే కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ఈ బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు.
గతంలో సోనియా గాంధీ గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్లపై హామీ ఇచ్చి, చిత్తశుద్ధి లేక నామమాత్రపు ప్రయత్నాలతో కాలయాపన చేశారని ఆమె మండిపడ్డారు. డీలిమిటేషన్ తర్వాత మహిళలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిసినా ఆమె అబద్ధాలు, అపోహలతో దేశ ప్రజలను ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.