మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌ రావు కన్నుమూత

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌ రావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు (90) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఆయనకు ఇద్దరు కుమారులు.  1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో కీలక శాఖలను నిర్వహించారు.  1982లో నందమూరి తారక రామారావు ‘తెలుగుదేశం’ పార్టీని హైదరాబాద్ ఎమ్యెల్యే క్వార్టర్స్ లోని ఆయన ఇంటి వద్దే స్థాపించారు.1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించాక, ఎన్టీఆర్​ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందిన ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీలో చేర్చుకొన్నప్పటి నుండి అంతర్గతంగా విబేధాలు చెలరేగుతూ వచ్చాయి.  ఆ విబేధాల కారణంగా పార్టీలో తిరుగుబాటు జరిపి, కాంగ్రెస్ మద్దతుతో 1984 ఆగస్టు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా నెల రోజులకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రతిపక్షాలు అన్ని టిడిపి నేతృత్వంలో `ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం’ చేపట్టడం, కాంగ్రెస్ లో బలమైన వర్గాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం పట్ల విముఖత వ్యక్తం చేయడం కారణంగా ఆయన ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగలేదు.  తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1998లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2019లో ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా నాదెండ్ల మనోహర్ జనసేన నేతగా, మంత్రిగా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.  ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.