కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ నివేదికను నిలిపివేసిన హైకోర్టు

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌ నివేదికను నిలిపివేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది.
అయితే ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది.  ఈ పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 6ను సమర్థించిన హైకోర్టు జీవో నంబర్ 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.   
 
విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు లేదా తదుపరి విచారణలు చేపట్టాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మెడిగడ్డ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ విచారణ విధానాన్ని హైకోర్టు తప్పుబట్టడం, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సాగిన ఈ విచారణ చెల్లదని కోర్టు చెప్పడం ధర్మం గెలిచినట్లేనని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఇలాంటి కమిషన్లు వేసిందని ఆయన విమర్శించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు.

మరోవంక, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఈ స్టే రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, తప్పిదాలేనని స్పష్టమవుతోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు విమర్శించారు.  ఈ పరిణామాలు చూస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అసలు అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని ఆయన ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.