ప్రముఖ నిర్మాత, నటుడు, అనలిస్ట్, సీనియర్ బీజేపీ నాయకుడు త్రిపురనేని చిట్టిబాబు (70) ఇకలేరు. ఛాతిలో నొప్పి రావడం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ చిట్టిబాబు గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య ఉషా లత, ముగ్గురు సంతానం నరోత్తం త్రిపురనేని, భాస్వంత్ త్రిపురనేని, మోనిషా త్రిపురనేని ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 1955 జూలై 28న చిట్టిబాబు జన్మించారు. ఆయన పూర్తి పేరు త్రిపురనేని వరప్రసాద్. చిట్టిబాబు తండ్రి ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి. ఆయన కూడా ప్రముఖ రచయిత. ఇక చిట్టిబాబు మద్రాస్‌లో చదువుకున్నారు. సినిమాపై ఆసక్తితో తండ్రి మహారథి వారసత్వంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అనేక చిత్రాల్లో ఆయన నటించారు.
చివరగా జాంబీరెడ్డి చిత్రంలో నటించారు. కెరీర్లో తొలుత పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చిట్టిబాబు నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో, యూనియన్ వ్యవహారాలలో ఆయన క్రియాశీలకంగా ఉండేవారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిట్టిబాబు తన దీర్ఘకాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలోని అనేక ప్రముఖులతో కలిసి పనిచేశారు.
కెరీర్లో 12 చిత్రాలకు దర్శకునిగా, 47 చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. అలాగే దాదాపు 30 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా పలు సినిమాలు రూపొందించారు. చిట్టిబాబు మృతి భారతీయ జనతా పార్టీకి, సినీ రంగానికి తీరని లోటు అని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
చిట్టిబాబు కేవలం ఒక కళాకారుడిగానే కాకుండా, బిజెపి సిద్ధాంతాల పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన నాయకుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి ఒక ముందడుగు వేసిన కార్యకర్తగా, సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి ఆయన విశేషమైన సేవలందించారని కొనియాడారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, నిరాడంబరత మనందరికీ స్ఫూర్తిదాయకం అని నివాళులు అర్పించారు.

More Stories
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేసిన హైకోర్టు
ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు