ప్రపంచానికి జీవితంపై భారత్ దృక్పథం అవసరమని ప్రపంచం గ్రహిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. తెలిపారు. అందుకే నేడు ప్రపంచానికి భారత్ అవసరం ఉందని, సనాతన ధర్మం యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ త్రిపుర జిల్లాలోని మోహన్‌పూర్ ఉపవిభాగం పరిధిలోని ఫకీర్‌మురా గ్రామంలో, ఆది శంకరాచార్యుల పవిత్ర దినాన, మా త్రిపురేశ్వరికి అంకితం చేసిన “మా సౌందర్య చిన్మయి మందిరం”ను ప్రారంభిస్తూ చిన్మయ హరిహర విద్యాలయంలో పూర్తిగా ఉచిత విద్యను అందించాలనే లక్ష్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. జ్ఞానం అంటే మాటలు కాదని, జ్ఞానం అంటే అవగాహన అని తెలిపారు.
రెండు వేల సంవత్సరాలుగా, ప్రపంచం మొత్తం విజ్ఞాన శాస్త్రం నుండి సామ్యవాదం వరకు అనేక తత్వశాస్త్రాల ప్రయోగాలను చవిచూసిందని, కానీ ప్రస్తుత కాలంలో, ప్రపంచానికి జీవితంపై భారత్ దృక్పథం అవసరమని ప్రపంచం గ్రహిస్తుందని ఆయన తెలిపారు. అందుకే నేడు ప్రపంచానికి భారత్ అవసరం ఉందని, సనాతన ధర్మం యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపుతోందని ఆయన స్పష్టం చేశారు.
దేవాలయాలు భారతీయ సామాజిక జీవితానికి కేంద్ర బిందువుగా ఉండేవని పేర్కొంటూ నేడు అధికారంతో పాటు భక్తి కూడా అవసరం అని తెలిపారు. అంతేకాకుండా, అందరితో కలిసిపోయి అందరికీ సేవ చేసే తత్వం ఉన్నవారిని సమాజం గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఇదే భారత్ సంస్కృతి అని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలు సేవా కార్యక్రమాలలో అత్యంత చురుకుగా పాల్గొంటున్నాయని సర్ సంఘచాలక్ వివరించారు.
ఎన్నో యుగాలుగా మన మధ్య వైవిధ్యం ఉందని, అప్పటి నుండి మనమందరం ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని, కానీ, భారత్ ఈ ఎదుగుదలను అడ్డుకోవడానికి బాహ్య శక్తులు మన మధ్య విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
నేటి యుగంలో కేవలం సత్యాన్ని కలిగి ఉండటం సరిపోదని, ఆ సత్యాన్ని నిరూపించడానికి బలం అవసరమని సర్ సంఘచాలక్ స్పష్టం చేశారు. భారత్ బలం దాని సంస్కృతిలోనే ఇమిడి ఉందని, అయితే, భారత్ ఎన్నడూ దూకుడు మనస్తత్వాన్ని పెంచుకోలేదని తెలిపారు. భారత్ నిరంతరం శాంతి, సౌభ్రాతృత్వం కోసం వాదించిందని పేర్కొంటూ నేటి యుద్ధ పీడిత ప్రపంచంలో అత్యవసరంగా కావలసిన శాంతి ఇదేనని తెలిపారు.
సరిగ్గా ఈ రంగంలోనే భారత్ తన కృషిని కొనసాగిస్తోందని చెప్పారు. నదులు, కొండలు, పర్వతాలతో సహా ప్రకృతి పట్ల ప్రగాఢమైన భక్తిభావంతో కూడిన, భారత్ స్వీకరించిన విశిష్టమైన దైవారాధన విధానాన్ని దేశంలోని సామాజిక వ్యవస్థలోని ప్రతి మూలకూ వ్యాపింపజేసే కార్యాన్ని భారత ఋషులు, దార్శనికులు చేపట్టారని తెలిపారు. ఈ బృహత్తర ప్రయత్నం రాత్రికి రాత్రే నెరవేరలేదని, ఆ మహోన్నత ఆశయం ఒక అవిశ్రాంత ప్రక్రియగా కొనసాగుతోందని వివరించారు.

More Stories
పహల్గమ్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’
ప్రధాని మోదీ ఒక ‘ఉగ్రవాది’.. ఖర్గే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
యుద్ధంతో నాల్గవ వంతు పడిపోయిన ఎరువుల ఉత్పత్తి