తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీతో ఏఐఏడీఎంకే పొత్తుపెట్టుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నాదురై ఫొటో పెట్టుకునే ఏఐఏడీఎంకే వారు మోదీతో ఎలా కలుస్తారు? ఆయన ఒక ఉగ్రవాది. ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు. అలాంటివారితో వీరు చేతులు కలపడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే. అన్నాదురై, కామరాజ్, పెరియార్, కలైంజ్ఞర్ (కరుణానిధి), బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నీరుగార్చడమే” అంటూ విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు భ్రూణహత్యకు పాల్పడ్డాయని ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆరోపించిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే దీనిపై రాజకీయ దుమారం చెలరేగడంతో ఖర్గే వివరణ ఇచ్చారు.
“లేదు, లేదు. ఆయన (ప్రధాని మోదీ) ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. నేను ఆయనను ఉగ్రవాది అని ఎప్పుడూ అనలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మోదీ ఎప్పుడూ బెదిరిస్తూ ఉంటారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇప్పడు నియోజక వర్గాల పునర్విభజనను కూడా ఆయన తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన అందరినీ భయపెడుతున్నారని నేను అన్నాను. అంతేకానీ నేను ఆయనను ఉగ్రవాది అని అనలేదు” అంటూ సర్దుబాటు చర్యలకు దిగారు.
ఖర్గే వివరణ ఇచ్చినప్పటికీ బీజేపీ మాత్రం ఆయనపై విమర్శలు ఆపలేదు. పైగా కాంగ్రెస్ పార్టీని ‘అర్బన్ నక్సల్ పార్టీ’ అని విమర్శించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఉందని ఆరోపించింది. కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సైతం ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాన మంత్రి మోదీని అవమానించినందుకు గాను కాంగ్రెస్ ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Stories
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్
పాక్ లింకులున్న జైపూర్ మహిళ కేసులో హనీట్రాప్, సూసైడ్ దాడులు
ఉగ్రవాదం, సైబర్ ముప్పులపై బ్రిక్స్ ఉక్కుపాదం మోపాలి