యుద్ధంతో నాల్గవ వంతు పడిపోయిన ఎరువుల ఉత్పత్తి

యుద్ధంతో నాల్గవ వంతు పడిపోయిన ఎరువుల ఉత్పత్తి
* సరఫరా తగ్గడంతో ఎరువుల ధరలు రెట్టింపు 
ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు భార‌తీయ ఉత్ప‌త్తి రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయి. భార‌తీయ ఎరువుల రంగంపై యుద్ధ ప్ర‌భావం మ‌రీ అధికంగా ఉన్న‌ది. కేంద్ర వాణిజ్య శాఖ రిలీజ్ చేసిన డేటా తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దేశంలో ఎరువుల ఉత్ప‌త్తి సుమారు నాల్గవ వంతు ప‌డిపోయిన‌ట్లు అధికారి డేటా పేర్కొన్న‌ది.  
ముఖ్యంగా వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా లభ్యతపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ పరిస్థితి ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ లో ఎరువుల ఉత్ప‌త్తి మార్చిలో 24.6 శాతానికి ప‌డిపోయిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 
ఎరువుల త‌యారీలో స‌హ‌జ‌వాయువు చాలా కీల‌క‌మైంది. అయితే ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల నేప‌థ్యంలో నేచుర‌ల్ గ్యాస్ దిగుమ‌తి క్షీణించింది. ఎరువుల ఉత్ప‌త్తికి కీల‌క‌మైన స‌హ‌జ‌వాయువు త‌గ్గ‌డంతో.. గ‌త ఏడాదితో పోలిస్తే మార్చి నెల‌లో ఎరువుల ఉత్ప‌త్తి 24.6 శాతం త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.

నేచుర‌ల్ గ్యాస్ ద్వారా ఎక్కువ‌గా యూరియాను ఉత్ప‌త్తి చేస్తారు. భార‌తీయ ఎరువుల రంగంలో యూరియా చాలా ప్రాధాన‌మైంది. విస్తృత‌మైన భార‌తీయ వ్య‌వ‌సాయ రంగంలో యూరియాను ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు. హోర్ముజ్ జ‌ల‌సంధి మూసివేయ‌డం వ‌ల్ల ఆ మార్గం ద్వారా రావాల్సిన స‌హ‌జ ఇంధ‌న స‌ర‌ఫ‌రాలు ప‌డిపోయాయి. దీని వ‌ల్ల ఎరువుల ఉత్ప‌త్తి కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. 

ఫెర్టిలైజ‌ర్ ఉత్ప‌త్తికి సంబంధించిన ఇన్‌పుట్స్ అన్నీ హోర్ముజ్ జ‌ల‌సంధి మార్గం ద్వారానే భారత్ కు వ‌స్తుంటాయి. అయితే అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయ‌డంతో ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన ఎరువుల్లో మూడో వంతు హోర్ముజ్ జ‌ల‌సంధి మార్గంలోనే వెళ్తుంటాయి.  ఎరువుల‌కు చెందిన ముడిస‌రుకుల స‌ర‌ఫ‌రా దెబ్బ‌తిన‌డంతో దాని వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహార ఉత్ప‌త్తిలో కూడా అస‌మ‌తుల్య‌త రానున్న‌ది.

140 కోట్ల భార‌తీయ జ‌నాభాకు వ్య‌వ‌సాయ‌మే ముఖ్య‌మైంది. సుమారు 45 శాతం దేశ ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డుతారు. ఇక ఆహార ధాన్యాల ఉత్ప‌త్తిలో యూరియాను అధికంగా వాడుతున్నారు.  ప్ర‌స్తుతం ఇరాన్ యుద్ధంతో యూరియా ఉత్ప‌త్తి ప‌డిపోవ‌డం, ఫ‌లితంగా ఎరువుల ఉత్ప‌త్తి త‌గ్గ‌డం, ఆ ప్ర‌భావం భార‌తీయ వ్య‌వ‌సాయ రంగాన్ని క్షీణింప‌చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  ఇప్పటికే సరఫరా తగ్గడంతోపాటు ధరలు రెట్టింపయ్యాయి.

ఇండియన్‌ పొటాష్‌ లిమిటెడ్‌ ఫిబ్రవరి 18వ తేదిన పిలిచిన టెండర్‌కు, తాజాగా ఈ నెల 4న పిలిచిన టెండర్‌లో యూరియా ధరల్లో భారీ తేడా చోటుచేసుకుంది.  ఫిబ్రవరిలో టన్ను 508 డాలర్లుగా ఉండగా, తాజాగా అది 935 నుండి 959 డాలర్లకు చేరుకుంది. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.  ఈ పరిస్థితి ఒక్క యూరియాకే పరిమితం కాలేదు. గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ సంస్థ ఇటీవల దిగుమతి చేసుకున్న డై అమ్మోనియం ఫాస్పేట్‌ (డిఎపి) ధర టన్నుకు సుమారు 865 డాలర్లుగా (ఖర్చు, రవాణా) ఉంది. 

యుద్ధం ప్రారంభానికి ముందు ఈ ధర టన్నుకు 720 డాలర్లుగా ఉండగా, గతేడాది ఇదే సమయానికి 680 డాలర్లుగా ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఇది భారత్‌కు చేరుకునే సమయానికి 925 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఎరువుల తయారీలో వినియోగించే వివిధ రసాయనాల పరిస్థితి ఇదే మాదిరి ఉంది.  యుద్ధానికి ముందు భారతదేశంలోకి దిగుమతి అయ్యే సల్ఫర్‌ ధర టన్నుకు 550 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం అది 900 డాలర్ల కంటే తక్కువకు లభించడం లేదు.

గతేడాది ఏప్రిల్‌ సల్ఫర్‌ టన్ను ధర కేవలం 300 డాలర్లు కావడం గమనార్హం. అమ్మోనియా ధర టన్నుకు 850-900 డాలర్లుగా ఉంది. ఇది ఏడాది క్రితం సగటు ధర 435 డాలర్ల కన్నా ఎక్కువ. ఇరాన్‌ ప్రతి చర్యలతో ఖతర్‌ ఎనర్జీ, సౌదీ అరేబియాకు చెందిన అమ్మోనియా ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా నుండి ముడిసరుకును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది ఖరీఫ్‌కు మొత్తం 19.4 టన్నుల యూరియా కావాల్సి వుంది. 

ఈ నెల ప్రారంభంలో వాస్తవ లభ్యత కేవలం 5.5 మిలియన్‌ టన్నులు మాత్రమే. భారత్‌ ఏటా 39-40 మిలియన్‌ టన్నుల యూరియాను వినియోగిస్తోంది. దీనిలో 30-31 టన్నులు దేశీయంగా ఉత్పత్తి కాగా, మిగిలిన 9-10 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంటోంది. యుద్ధానికి ముందు, భారత యూరియా దిగుమతుల్లో సుమారు 40శాతం గల్ఫ్‌ దేశాలైన ఒమన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యుఎఇ, బహ్రెయిన్‌ల నుండి వచ్చేవి. 

యూరియా స్వదేశీ తయారీకి వినియోగించే ముడి పదార్థమైన ద్రవ సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) దిగుమతుల్లో సుమారు 60శాతంపైగా ఖతర్‌, యుఎఇ, ఒమన్‌ లపై ఆధారపడుతున్నాం. వ్యవసాయశాఖ వర్గాల సమాచారం ప్రకారం సాధారణంగా నెలకు సుమారు 2.5 మిలియన్‌ టన్నుల యూరియా దేశీయంగా ఉత్పత్తి అవుతోంది.  ఎల్‌ఎన్‌జి సరఫరా అంతరాయాల కారణంగా మార్చిలో 1.5 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగాం. ఈ నెలలో కూడా ఇది 1.7-1.8 మిలియన్‌ టన్నుల మధ్యే ఉంటుంది. ఒక వేళ యుద్ధం త్వరగా ముగిసి, హార్ముజ్‌ ద్వారా ఎల్‌ఎన్‌జి పంపిణీ ప్రారంభమైనప్పటికీ, జూన్‌ కంటే ముందు 2.5 మిలియన్‌ టన్నుల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు.