ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ
అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతం అదానీ సంపదలో ముకేష్‌ అంబానీని దాటేశారు. ఇటీవల అదానీ గ్రూప్‌ షేర్లు మార్కెట్‌లో దూసుకుపోవడంతో గౌతమ్‌ అదానీ తన చిరకాల ప్రత్యర్థి ముకేష్‌ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.  ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన టాప్ 20 జాబితాను బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసింది.
ఈ 20 మందిలో భారత్ నుంచి ఇద్దరు ఉన్నారు. అది గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ. మిగతా వారిలో ఫ్రాన్స్ నుంచి ఒకరు, స్పెయిన్ నుంచి మరొకరు, మెక్సికో నుంచి ఇంకొకరు ఉన్నారు. ఈ ఐదుగురు మినహా టాప్ 20లో మిగతా 15 మంది అమెరికన్లే ఉండటం విశేషం. ఎప్పట్లాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎక్స్, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు.
 
ఈ రిపోర్ట్‌ ప్రకారం అదానీ నికర విలువ 92.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.5లక్షల కోట్లు)కు చేరుకోగా, అంబానీ 90.8 బిలియన్‌ డాలర్ల (8.40 లక్షల కోట్లు)తో తర్వాతి స్థానానికి పడిపోయారు.  ఆయన సంపద 16.9 బిలియన్ డాలర్లు తగ్గింది కేవలం ఒక్క రోజులోనే అదానీ తన సంపదకు 3.56 బిలియన్లు (రూ.33వేల కోట్లు) జోడించుకోవడం గమనార్హం. 
 
అంతర్జాతీయంగా అదానీ ర్యాంక్‌ 19గా, అంబానీ ర్యాంక్‌ 20గా ఉంది. టాప్‌ 500లో 23 మంది భారతీయ పెట్టుబడిదారులున్నారు.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అదానీ సంపద 8.1 బిలియన్‌ డాలర్లు పెంచుకున్నారు.