పశ్చిమాసియా, ఉక్రెయిన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ సైనిక ఘర్షణ సమస్యలను పరిష్కరించలేదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈవిషయంలో భారత్, ఆస్ట్రియాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని మోదీ తేల్చి చెప్పారు. అది ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా శాంతి, సుస్థిరతలకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
నానాటికీ పెరుగుతున్న ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను సూచించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో సంస్కరణలు జరగాలనే దానిపైనా భారత్, ఆస్ట్రియాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఆస్ట్రియా ఛాన్స్‌లర్ క్రిస్టియన్ స్టాకర్ నాలుగు రోజుల భారత పర్యటన కోసం మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం రోజు భారత ప్రధాని, ఆస్ట్రియా ఛాన్స్‌లర్ ద్వైపాక్షిక భేటీ జరిగింది.
అనంతరం ఏర్పాటుచేసిన సంయుక్త మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం యావత్ ప్రపంచం చాలా సీరియస్, ఉద్రిక్త పరిస్థితులను చవిచూస్తోంది. ఈ సవాళ్లు అన్ని ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. సైనిక ఘర్షణలను కొనసాగిస్తూ పోతే, శాశ్వత పరిష్కారం అనేది అస్సలు లభించదు” అని తెలిపారు.
అందుకే పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో శాంతి, సుస్థిరతల స్థాపన అత్యవసరమని భారత్, ఆస్ట్రియా భావిస్తున్నాయని, ఇక ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ఇరుదేశాలు కలిగి ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు.
భారత్, ఆస్ట్రియాలు వాణిజ్యం, టెక్నాలజీ, హరిత ఇంధనం వంటి విభాగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకుంటాయని ఆస్ట్రియా ఛాన్స్‌లర్ క్రిస్టియన్ స్టాకర్ వెల్లడించారు. దీనివల్ల ఇరుదేశాల ప్రజలు, వ్యాపారాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భవిష్యత్తులో ఈయూ-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు సహా అన్ని విభాగాల్లోనూ కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన తెలిపారు.
గత 4 దశాబ్దాల్లో భారత్‌లో పర్యటించిన తొలి ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ను తానేనని స్టాకర్ చెప్పారు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన భారత్ – ఆస్ట్రియా స్నేహంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు పెరుగుతున్న ఈ తరుణంలో ఉమ్మడి విలువల ప్రాతిపదికన భారత్, ఆస్ట్రియా లాంటి విశ్వసనీయ దేశాలు చేతులు కలుపుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా పలు కీలక ప్రకటనలు కూడా చేశారు. ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి సారిస్తూ, రహదారి మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక సహకారం కోసం తమ అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి భారత్, ఆస్ట్రియా అంగీకరించాయి. శాంతి పరిరక్షణ శిక్షణ, కార్యకలాపాలలో సహకారాన్ని పెంపొందించడానికి, భారతదేశానికి చెందిన ‘సెంటర్ ఫర్ యూఎన్ పీస్‌కీపింగ్’, ఆస్ట్రియాకు చెందిన ‘ఆటింట్’ మధ్య భాగస్వామ్యం ఏర్పడుతుంది.

More Stories
రిజర్వేషన్లను అడ్డుకునే వారిని మహిళలు క్షమించరు
కులగణన, రిజర్వేషన్ లపై అఖిలేశ్, అమిత్ షా మాటల హోరు
815 లోక్‌సభ సీట్లలో.. 272 సీట్లు మహిళలకే