16న మరోసారి అమెరికా, ఇరాన్ మ‌ధ్య చ‌ర్చ‌లు!

16న మరోసారి అమెరికా, ఇరాన్ మ‌ధ్య చ‌ర్చ‌లు!

* ఇస్లామాబాద్ లేదా జెనీవాలో

అమెరికా, ఇరాన్ మ‌ధ్య పాకిస్థాన్‌లో రెండో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. రెండు దేశాల ప్ర‌తినిధిలు గ‌త వారం ఇస్లామాబాద్‌లోమొద‌టిసారి జ‌రిగిన చ‌ర్చ‌ల్లో శాంతి ఒప్పందం కుద‌ర‌లేద‌ని అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. దీంతో ఆ చ‌ర్చ‌లు అస‌మ‌గ్రంగా ముగిశాయి.  ఈ నెల 16న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లేదా స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఈ చర్చలు జరగొచ్చని సమాచారం.
 
కాల్పుల విరమణ గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి అమెరికా, ఇరాన్ చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌పై సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండోసారి చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని పాకిస్థాన్ తెలిపింది.  మధ్యవర్తిత్వం వహించే దేశాల సహకారంతో రెండో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  ఏప్రిల్ 21వ తేదీన కాల్పుల విర‌మ‌ణ గ‌డువు ముగుస్తుంది. ఈ లోగా చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో అమెరికా ప్ర‌తినిధులు ఉన్న‌ట్లు తెలిసింది.
రెండో రౌండ్ ముఖాముఖి చ‌ర్చ‌ల్లో ఆ బృందాలే పాల్గొంటాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్-అమెరికా తదుపరి చర్చల దశ త్వరలో ఉండవచ్చని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.  ఇప్పటివరకు ఎటువంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోలేదని, దీంతో చర్చలు కొంత మేర ఫలించాయన్న భావన కలిగిందని చెప్పారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయని సూచించారు.
కాగా, అమెరికా, ఇరాన్ మ‌ధ్య చ‌ర్చ‌ల పున‌రుద్ద‌ర‌ణ జ‌ర‌గాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ పిలుపునిచ్చారు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని కొన‌సాగించాల‌ని చెబుతూ కొన్ని వారాల పాటు సాగిన విధ్వంసం, విషాదం త‌ర్వాత‌ ప‌శ్చిమాసియాలో ప్ర‌స్తుత సంక్షోభానికి సైనిక ప‌రిష్కారం కాద‌ని తెలిసింద‌ని ఆయన స్పష్టం చేశారు.
చ‌ర్చ‌ల పున‌రుద్ద‌ర‌ణ జరిగి, ఓ ఒప్పందం కుద‌రాల‌ని, అన్ని ఉల్లంఘ‌న‌లు స్తంభించాల‌ని ఆయన సూచించారు. సంక్షోభానికి కార‌ణ‌మైన దేశాల‌న్నీ హోర్ముజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల స్వేచ్ఛ ప్ర‌యాణానికి గౌర‌వం ఇవ్వాల‌ని,  అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్ర‌కారం ఆ ప్ర‌క్రియ జ‌ర‌గాల‌ని ఆయన హితవు చెప్పారు. దాదాపు 80 శాతం అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అయితే అణు కార్యక్రమాల అంశంలో విభేదాలు తలెత్తడంతో ఒప్పందం నిలిచిపోయింది.
ముఖ్యంగా యురేనియం శుద్ధి విషయంలో ఇరు దేశాల మధ్య తేడాలు తీవ్రంగా కనిపించాయి. అమెరికా ప్రతిపాదన ప్రకారం, ఇరాన్ కనీసం 20 సంవత్సరాల పాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని కోరింది. అయితే ఇరాన్ మాత్రం ఐదేళ్లపాటు మాత్రమే ఆంక్షలను అంగీకరించగలమని తెలిపింది. అంతేకాకుండా, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు అప్పగించాలన్న ప్రతిపాదన కూడా చర్చల్లో కీలకంగా మారింది.