ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ పశ్చిమాసియా ప్రాంత శాంతి, సుస్థిరతల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. శాంతియుత సహజీవన సూత్రానికి కట్టుబడి ఉండటం, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, అంతర్జాతీయ చట్టాలను పాటించడం, అభివృద్ధి, భద్రతలో దేశాలు పరస్పరం సమన్వయం చేసుకోవడం అనేవి ఆ నాలుగు అంశాలు.
యూఏఈలోని అబుధాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. తాజాగా మంగళవారం రోజు బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వేదికగా అల్ నహ్యాన్‌తో షి జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈసందర్భంగానే పశ్చిమాసియా శాంతి, సుస్థిరతల కోసం 4 సూత్రాలను జిన్‌పింగ్ ప్రతిపాదించారంటూ చైనా ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా ఓ కథనాన్ని ప్రచురించింది.
మరోవంక, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ కూడా రెండు రోజుల పర్యటన కోసం మంగళవారమే బీజింగ్‌కు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన భేటీ కానున్నారు. ఇరువురు ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియా సైనిక ఉద్రిక్తతలపై ప్రధానంగా చర్చించనున్నారు. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా వీరు చర్చింపనున్నారు.
కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా నౌకాదళం ముట్టడించే ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభమైన తరుణంలో బీజింగ్‌లో రష్యా, చైనా విదేశాంగ మంత్రుల భేటీ, అబుధాబి యువరాజు చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. హర్మూజ్ జలసంధి మీదుగా సప్లై అయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం చైనాకే చేరుతుంటుంది. చైనా వినియోగించే మొత్తం ముడి చమురులో 38 నుంచి 45 శాతం హర్మూజ్ మీదుగానే ఆ దేశానికి సరఫరా అవుతుంది.
గత 31 ఏళ్లుగా ఇరాన్ ముడి చమురు, సహజ వాయువులపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ఇరాన్‌కు చెందిన ముడి చమురులో దాదాపు 80 నుంచి 90 శాతాన్ని ఒక్క చైనాయే కొంటోంది. ఇలా ఉండగా, హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్భందించి, ఇరానీ నౌకాశ్రయాలను మూసివేయడం ప్రమాదకరమని, బాధ్యతారాహితం అవుతుందని చైనా పేర్కొన్నది.
రెండు వర్గాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని, జలసంధి వద్ద అమెరికా తన బలగాల సంఖ్యను పెంచుతోందని, టార్గెట్ చేసి నౌకలను బ్లాక్ చేస్తున్నదని, దీంతో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉన్నట్లు చైనా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి గూవోజియాకున్ తెలిపారు.

More Stories
రెట్టింపైన యుద్ధ సంబంధిత లైంగిక నేరాలు
అణు కేంద్రాల వద్ద ల్యాంచ్ ప్యాడ్లు నిర్మిస్తున్న చైనా
బ్రెజిలియన్ ముఠాలను ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించిన అమెరికా