హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 15 భారత నౌకలు

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 15 భారత నౌకలు

* భారత్ నౌకలకు టోల్ వసూలు చేయడం లేదు .. ఇరాన్ 

హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల విషయంలో ఉత్కంఠ నెలకొంది. భారత్ కు సంబంధించి ఇటీవల కొన్ని నౌకలు హార్ముజ్ నుంచి బయటకు వచ్చినా, ఇంకా 15 భారతీయ నౌకలు ఈ జలసంధిలోనే చిక్కుకుపోయాయి. హార్ముజ్ జలసంధి పశ్చిమ దిశలోని చెక్ పాయింట్ వద్ద 15 భారత నౌకలు నిలిచిపోయాయి. 

వివిధ మంత్రిత్వ శాఖల సమావేశంలో ప్రసంగిస్తూ, ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్, హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన మొత్తం 15 భారతీయ పతాక నౌకలను వెనక్కి తీసుకురావడానికి నౌకా రవాణా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

ఇలా ఉండగా, భారత్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, హర్ముజ్ నుంచి వెళ్లే ఆ దేశ నౌకల నుంచి ఎలాంటి టోల్ వసూలు చేయడం లేదని  భారత్లోని టెహ్రాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ వెల్లడించారు. హర్మూజ్ జలసంధి ఇరాన్‌ ప్రాదేశిక జలాల్లోనే ఉందని స్పష్టం చేస్తూ ఆ జలాలను కాపాడుకోవడానికి తమకున్న హక్కులను వినియోగించుకుంటామని తెలిపారు. 
 
స్నేహపూర్వక దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు హర్మూజ్ మార్గాన్ని తెరిచి ఉంచుతామని చెబుతూ కష్టకాలంలో భారత్ ప్రభుత్వం, ప్రజలు చూపిన మద్దతుకు ఫతాలీ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలు నిజంగా విశ్వసనీయులు, సహానుభూతి గలవారని పేర్కొంటూ  భారత్ ప్రభుత్వంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ దేశ నౌకలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 
 
ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్‌ను అత్యంత సన్నిహిత మిత్ర దేశాలలో ఒకటిగా పేర్కొన్నారని తెలిపారు. ఈ నెల 11న హార్ముజ్ జలసంధిని జగ్ విక్రమ్ అనే ఎల్పీజీ ట్యాంకర్ దాటింది. ఈ నెల 15న ముంబై తీరానికి చేరుకోనుంది. ఈ నౌకలో 20,400 టన్నుల ఎల్పీజీ, 24 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌక ప్రస్తుతం అరేబియన్ జలాల్లో ఉంది. దీనికి భారతీయ నావికాదళం రక్షణ కల్పిస్తోంది. మరోవైపు ఇరాన్ నుంచి రెండు చమురు నౌకలు భారత్ కు చేరుకున్నాయి. ఏడేళ్ల తర్వాత ఇరాన్ చమురును భారత్ కొనుగోలు చేసింది.