* భారత్‌కు చేరిన రెండు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన భద్రతపై చర్యలు ప్రకటించింది. సాధారణ వినియోగదారులకు ఇంధనం అందుబాటులో ఉంచేందుకు 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని విస్తరించాలని నిర్ణయించింది. తక్కువ ఆదాయ వర్గాలు, వలస కార్మికులకు సులభంగా అందే విధంగా చిన్న సిలిండర్ల ఉత్పత్తి, పంపిణీ పెంచాలని చమురు సంస్థలకు సూచించింది.
పెద్ద సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నగరాల్లో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లను వేగవంతం చేసి, సిలిండర్లపై ఆధారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది. దేశంలోని వ్యూహాత్మక చమురు, గ్యాస్ నిల్వలను గరిష్ట స్థాయిలో ఉంచేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది.
మరోవంక, యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్ కు చెందిన రెండు చమురు నౌకలు భారత్ కు చేరుకున్నాయి. దాంతో దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరాన్ చమురు భారత దేశానికి వచ్చినట్లయ్యింది. ఈ రెండు నౌకలు గుజరాత్ లోని సిక్కా పోర్టులో లంగరేశాయని షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన రెండు చమురు నౌకలు మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి. ఇవి దాదాపు రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చాయి.
అయితే ఈ నౌకలను ఎవరు కొనుగోలు చేశారన్నదానిపై స్పష్టత లేదు. అమెరికా పెట్టిన ఆంక్షల కారణంగా భారత్ 2019 నుంచి ఇరాన్ చమురు కొనుగోలును నిలిపివేసింది. అయితే, ఇటీవల పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. సముద్ర జలాల్లో ఉన్న ఇరాన్ చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్ చమురు నౌకలు ఇప్పుడు భారత్‌కు చేరుకున్నాయి.

More Stories
మరింతగా పెరిగిన ధనిక, పేద దేశాల మధ్య అంతరం
డీజిల్, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకం పెంపు
ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో 49 శాతం భారత్ వాటా