ఎస్ఐఆర్ రెండో దశలో దేశవ్యాప్తంగా 5.38  కోట్ల ఓట్ల తొలగింపు 

ఎస్ఐఆర్ రెండో దశలో దేశవ్యాప్తంగా 5.38  కోట్ల ఓట్ల తొలగింపు 
దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌ 2.0) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.  దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ రెండో దశలో మొత్తం 5.38 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఇది మొత్తం ఓటర్లలో 10.56% తగ్గుదలగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోనే అత్యధికంగా 2.04 కోట్ల తొలగింపులు జరగగా, పశ్చిమ బెంగాల్‌లో సుమారు 91 లక్షల పేర్లు తొలగించారు.
 
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 13.39 కోట్లకు తగ్గింది. ఇది సవరణ ప్రక్రియకు ముందున్న 15.44 కోట్లతో పోలిస్తే సుమారు 13.24% తగ్గుదలగా నమోదైంది.  శాతం పరంగా చూస్తే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 16.9% తగ్గుదలతో అగ్రస్థానం ఉండగా, ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో సుమారు 13% తగ్గుదల నమోదైంది.  ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వరుసగా 12%, 11.5% తొలగింపులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇది 11.7% కాగా, కేరళలో 2.7% మాత్రమే తగ్గుదల కనిపించింది.
ఎస్‌ఐఆర్‌ 2.0 ప్రకారం ఈ తొలగింపులకు ప్రధాన కారణాలుగా 1.46 కోట్ల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించడం, 4.6 కోట్లకు పైగా నివాసం మారడం, 44 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో నమోదు కావడం వంటి అంశాలను ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. తొలగింపుల్లో అధిక భాగం పట్టణ ప్రాంతాల్లోనే నమోదవగా, గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన (ఎఎస్‌డి) వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌ తుది జాబితాలో 18-19 ఏళ్ల వయసు గల 17 లక్షల కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. జనవరిలో విడుదలైన ముసాయిదా జాబితాలో 2.89 కోట్ల పేర్లు తొలగించడంతో భారీ తగ్గుదల కనిపించినప్పటికీ, ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదుల మేరకు 84.28 లక్షల పేర్లు తిరిగి చేర్చడంతో తుది తగ్గుదల కొంత తగ్గింది. సాంకేతిక సమస్యలు కూడా వెలుగుచూశాయి.
సుమారు 1.04 కోట్ల మంది ఓటర్ల వివరాలు పాత జాబితాలతో సరిపోలకపోవడం, 2.22 కోట్ల కేసుల్లో పత్రాల తనిఖీలో తార్కిక వ్యత్యాసాలు గుర్తించడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో 2002 నాటి జాబితాలతో అనుసంధానం లేకపోవడం వల్ల సుమారు 27 లక్షల మంది ఓటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నారు. రెండో దశపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో మైక్రో అబ్జర్వర్లు, ధ్రువీకరణ ప్రక్రియలతో ఇది మరింత సంక్లిష్టమైంది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రక్రియ పూర్తి చేయడంలో ఆలస్యం జరిగి, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, విచారణలు పూర్తి కాకపోవడంతో గడువు నాలుగుసార్లు పొడిగించాల్సి వచ్చింది.