* అఖిల పక్షంకై కాంగ్రెస్ డిమాండ్
మహిళా రిజర్వేషన్ చట్టం, 2023కు సవరణలను ఆమోదించేందుకు బడ్జెట్ సమావేశాలను పొడిగించనున్న నేపథ్యంలో, మహిళల పట్ల బాధ్యతను ప్రదర్శించాల్సిన తరుణంగా అభివర్ణిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు వారి సహకారాన్ని కోరుతూ లేఖ రాశారు. దీనికి ప్రతిస్పందనగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, శాసన పూర్వ చర్చల కోసం అఖిలపక్ష సమావేశం జరపాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
అలాగే, అసెంబ్లీ ఎన్నికల నడుమ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంపై ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన నుండి శాసనసభలలో మహిళా రిజర్వేషన్ల అమలును వేరుచేసే సవరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కోరుతోంది. దానికి బదులుగా, లోక్‌సభలో ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యాన్ని నిర్ణయించడానికి జనాభాను కొలమానంగా ఉపయోగించకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలని ప్రతిపాదిస్తోంది.కాగా, ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలంటూ లోక్‌సభ, రాజ్యసభలలోని తమ ఎంపీలకు బీజేపీ ఆదివారం రోజు త్రీ లైన్ విప్‌ను జారీ చేసింది. “మహిళలకు పురోగతి సాధించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, మరీ ముఖ్యంగా నాయకత్వం వహించడానికి అవకాశం ఉన్నప్పుడే ఏ సమాజమైనా పురోగమిస్తుంది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న తన ఆశయాన్ని సాకారం చేసుకోవాలంటే, ఈ ప్రయాణంలో మహిళలు మరింత చురుకైన పాత్ర పోషించడం అత్యవసరం,” అని ఏప్రిల్ 11 నాటి తన లేఖలో మోదీ పేర్కొన్నారు.
2023 సెప్టెంబర్‌లో నారీ శక్తి వందన అధినియమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని గుర్తుచేస్తూ, భారతదేశ పార్లమెంటరీ ప్రయాణంలో అది ఒక “చిరస్మరణీయ ఘట్టం” అని ఆయన అభివర్ణించారు. ఇది పార్టీలకు అతీతంగా ఐక్యతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.చట్టం ఆమోదం పొందిన సమయంలో జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, దానిలోని నిబంధనలు వీలైనంత త్వరగా అమల్లోకి రావాలనే విస్తృత ఏకాభిప్రాయం ఉందని ప్రధానమంత్రి చెప్పారు.
2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తోనే నిర్వహించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సవరణలను ఆమోదించడానికి నాయకులందరూ “ఒకే స్వరంతో” ఏకం కావాలని ఆయన కోరారు. “ఇది ఏ ఒక్క పార్టీకి లేదా వ్యక్తికి సంబంధించిన ఘట్టం కాదు. మహిళల పట్ల, మన భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను ప్రదర్శించాల్సిన తరుణం ఇది,” అని ఆయన రాశారు.
తన ప్రత్యుత్తరంలో, 30 నెలల క్రితం మహిళా రిజర్వేషన్ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, దానిని వెంటనే అమలు చేయాలని అప్పట్లో కాంగ్రెస్ డిమాండ్ చేసిందని ఖర్గే ప్రధానమంత్రికి గుర్తు చేశారు. త్వరితగతిన అమలు చేయడంపై ఏకాభిప్రాయం ఉన్నట్లు ప్రధానమంత్రి లేఖలో పేర్కొన్నప్పటికీ, అప్పుడు ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
ప్రత్యేక సమావేశానికి ముందు ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదని ఖర్గే విచారం వ్యక్తం చేశారు. చట్టం అమలుకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వివరాలను ప్రభుత్వం పంచుకోకపోవడాన్ని ఆయన విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, సంబంధిత అంశాలపై స్పష్టత లేకుండా అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపామన్న ప్రధాని వాదనను తోసిపుచ్చుతూ, ప్రస్తుత విడత ఎన్నికలు ఏప్రిల్ 29, 2026న ముగిసిన తర్వాత, ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయని కాంగ్రెస్ అధినేత తెలిపారు.

More Stories
అయోధ్య విరాళాలు, యుజిసి నిబంధనలపై జాగ్రత్త!
సంఘ్ శాఖ వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రయోగశాల
బిజెపికి తలవంచబోను… బెంగాల్ అధ్యక్ష పదవిలో నేనే ఉంటా!