కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఒకొక్కరికి రూ 500 కోట్ల నిధులు ఇప్పుడు ప్రస్తావనకు రావడమే లేదు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో సహితం వాటి గురించి ప్రస్తావించలేదు. కొత్త కార్పోరేషన్‌లుగా ఏర్పడిన కొద్దిరోజుల్లోనే కార్పోరేషన్‌ల అధికారులతో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన ప్రత్యేక అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ నిధులను ప్రకటించారు.
నూతనంగా ఆవిర్భవించిన రెండు కార్పోరేషన్‌లకు ఒక్కొక్క కార్పోరేషన్‌కు రూ. 500 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రకటనచేసి నెల రోజులకుపైగా గడిచినా, అనంతరం మరోమారు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినా ప్రకటించిన రూ. 500 కోట్లకు సంబంధించి కార్పోరేషన్‌ల ప్రత్యేకాధికారి తిరిగి ప్రస్తావించడమే లేదు. ఆయన అధికారులను ఉత్సాహ పరచేందుకు ఈ విధమైన ప్రకటన చేశారా లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల మేరకే ప్రకటించారా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండానే రాష్త్ర ప్రభు త్వంలో అత్యంత సీనియర్ అధికారి అయినా ఇటువంటి ప్రకటనను వ్యక్తిగతంగా చేస్తారని ఎవ్వరూ భావించడం లేదు. గత మార్చిలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాల కేటాయింపుల్లోనూ కొత్తగా ఏర్పడిన కార్పోరేషన్‌లు సైబారాబద్, మల్కాజిగిరిలకు నిధుల కేటాయింపు గురించి ఎటువంటి ప్రస్తావన లేక పోవడం సంబంధిత అధికారులకే కాకుండా, ప్రజాప్రతినిధులకు సహితం విస్మయం కలిగిస్తున్నది.
కేవలం హెచ్‌సిటీ ప్రాజెక్టులకు మాత్రమే రూ. 2654 కోట్లను కేటాయించిన ప్రభుత్వం మరి ఈ రూ. 500 కోట్ల ప్రస్తావన చేయలేదు. గతంలో జీహెచ్‌ఎంసి వరకు మాత్రమే హెచ్‌సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్‌ఎంసిలో శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. అదనంగా పెరిగిన ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ధి పథకాలను చేపట్టడం జరగాల్సి ఉంది.
మరి వీటిని నిధుల సహాకారం చేయాల్సిన ప్రభుత్వం కాస్త వార్షిక బడ్జెట్ అంచనాలలో కొత్త మున్సిపల్ కార్పోరేషన్‌లకు నిధులను కేటాయించకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఆస్తి పన్ను, ప్లానింగ్‌పైనే ఎర్లీబర్డ్ స్కీంతో వచ్చే ఆస్తిపన్ను వసూలు, టౌన్‌ప్లానింగ్ విభాగం వసూలు చేసే భవన నిర్మాణాల ఫీజుల నుండి వస్తున్న ఆదాయంపైనే ఈ రెండు కొత్త కార్పోరేషన్‌లు ఆధారపడి ఉన్నాయి.
వచ్చే ఆదాయం మేరకు కార్పోరేషన్ ఉద్యోగుల జీతభత్యాలను అందించనున్నది. ఈ రెండు విభాగాల నుండి ఆదాయం వస్తేనే ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన జీతాలు తమతమ బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని, లేదంటే జాప్యం కావడం ఖాయమనేది అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఆస్తిపన్ను వసూలు సిఎంసిలో రూ. 1000.36 కోట్లుగా ఉంటే మల్కాజిగిరి కార్పోరేషన్‌కు రూ. 962.62 కోట్లు వసూలైనట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఒక్క మార్చినెలకు సైబారాబాద్‌లో ఆస్తిపన్ను రూ. 143.69 కోట్లుగా ఉంటే ఎంఎంసిలో రూ.107.09 కోట్లు వసూలైంది. 2025-26 టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా సిఎంసికి రూ. 538.09 కోట్లు, ఎంఎంసికి రూ.198.24 కోట్లు ఆదాయంగా వచ్చాయి. ఇప్పుడు ఈనెల(ఏప్రిల్)లో ఎర్లీబర్డ్ స్కీం అమలులో ఉన్నందున ఆస్తిపన్ను కొంతమేర ఖజానాకు చేరే అవకాశాలున్నాయి. అనంతరం ఇక టౌన్‌ప్లానింగ్ నుండి వచ్చే ఆదాయంపైనే ఈరెండు కార్పోరేషన్‌లు ఆధారపడాల్సి ఉంటుందనేది అధికారులు వివరిస్తున్నారు.

More Stories
మావోయిస్టుల నిష్క్రమణతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఉషోదయం
`దురంధర్ ది రివేంజ్’ సినిమా వీక్షించిన కిషన్ రెడ్డి
హైడ్రా పేరుతో గిరిజన ఇళ్లపై దాడి