అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం

అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం

ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత, చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే దానిపై వాషింగ్టన్, టెహ్రాన్‌ల యు నుండి పరస్పర విరుద్ధమైన కథనాలు వెలువడ్డాయి. అమెరికా డిమాండ్ల కారణంగానే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ప్రభుత్వం మీడియా పేర్కొంది.  సుమారు 21 గంటల పాటు చర్చల్లో దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. కానీ అమెరికా డిమాండ్లు ఒప్పందాన్ని కుదరకుండా అడ్డుకున్నాయని చెప్పింది.

హర్మూజ్‌ జలసంధి, ఇరాన్‌ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠంభన కారణంగానే ఇవి విఫలమయ్యాయని తెలిపింది.  ఇలా ఉన్నతస్థాయిలో అమెరికా-ఇరాన్‌ల మధ్య ముఖాముఖీ చర్చలు జరగడం 1979 ఇస్లామిక్‌ విప్లవం తరువాత ఇదే మొదటిసారి!  అమెరికా డిమాండ్లకు టెహ్రాన్ ‘ఖచ్చితంగా తిరస్కరించింది’ అని ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. చర్చల నుండి వైదొలగడానికి వాషింగ్టన్ ‘ఒక సాకు వెతుకుతోందని’, ‘యుద్ధం ద్వారా సాధించలేని’ రాయితీలను కోరుకుంటోందని ఆరోపించింది.

ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన ప్రతిష్టంభన తొలగించి శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్‌ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖీ చర్చలు జరిపింది.

మధ్యవర్తి దేశమైన పాకిస్తాన్‌కు చెందిన ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ — ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీలు రెండు గంటలకు పైగా నేరుగా చర్చలు జరిపారు. ఈ రెండు బృందాలు తొలుత పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యాయి.  

అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్‌ తెలుపడంతో ఆందోళన కలిగిస్తున్నది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిబంధనలు అంగీకరించేందకు ఇరాన్‌ ఏమాత్రం సిద్ధంగా లేదని జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు.  అయితే, చర్చలు విఫలం కావడానికి ప్రధాన వివాదాంశాలు ఏమిటనే విషయాన్ని ఆయన వివరించలేదు. కానీ, వాటిలో అణు అంశం ఒకటి అని మాత్రం పేర్కొన్నారు.  

ఇరాన్  అణ్వాయుధాలను గానీ, వాటిని సమకూర్చుకోవడానికి అవసరమైన సాధనాలను గానీ తయారుచేయదనే హామీలు అమెరికాకు అవసరమని ఆయన తెలిపారు. అయినప్పటికీ, అమెరికా వైఖరి చాలా “సరళంగానూ, సానుకూలంగానూ” ఉందని వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని జెడి వాన్స్ అభివర్ణించారు. “మేము గత 21 గంటలుగా నిరంతరాయంగా చర్చలు జరుపుతున్నాము.

ఇరాన్ ప్రతినిధులతో మేము అనేక కీలకమైన సంప్రదింపులు జరిపాము. అది శుభవార్త. అయితే, దుర్వార్త ఏమిటంటే—మేము ఇంకా ఏ ఒప్పందానికీ రాలేకపోయాము. ఈ పరిణామం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టదాయకమని నేను భావిస్తున్నాను. మా షరతులను అంగీకరించకూడదని వారు నిర్ణయించుకున్నారు,” అని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

“అమెరికా తన పరిమితులు ఏమిటో, ఎక్కడ సడలింపులు ఇస్తామో, ఎక్కడ ఇవ్వమో అన్ని అంశాల గురించి స్పష్టంగా చేశాం. అయినప్పటికీ ఇరాన్ ప్రతినిధులు మాత్రం మా షరతులను అగీకరించడానికి నిరాకరించారు. మేం తిరిగి వెళ్తున్నాం. నేను అన్ని వివరాలను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే 21 గంటల పాటు రహస్యంగా చర్చలు జరిపిన తర్వాత వాటిని బహిరంగంగా చర్చించడం నాకిష్టం లేదు” అని జేడీ వాన్స్​ తెలిపారు.
 
చర్చల్లో ఇరుపక్షాలు పురోగతి సాధించడంలో విఫలమైన తర్వాత అమెరికాను విమర్శిస్తూ, అమెరికన్ల ‘అసమంజసమైన’ డిమాండ్ల కారణంగా చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెలిపింది. అమెరికా ‘అతిగా డిమాండ్లు, చట్టవిరుద్ధమైన అభ్యర్థనలు’ చేయడం మానుకోవాలని కూడా అది పేర్కొంది. 
 
“ఇరాన్ ప్రజల జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం 21 గంటల పాటు నిరంతరాయంగా, తీవ్రంగా చర్చలు జరిపింద. ఇరాన్ ప్రతినిధి బృందం పలు ప్రయత్నాలు చేసినప్పటికీ, అమెరికా పక్షం అసమంజసమైన డిమాండ్లు చర్చల పురోగతిని అడ్డుకున్నాయి. అందువల్ల చర్చలు ముగిశాయి,” అని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (ఐఆర్ఐబి) టెలిగ్రామ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఆ తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ మాట్లాడుతూ, “అమెరికా వాగ్దాన భంగం, దురుద్దేశపూర్వక చర్యల అనుభవాలను మా దేశం మరచిపోలేదు, మరచిపోబోదు” అని స్పష్టం చేశారు. తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్ తనకున్న అన్ని సాధనాలను ఉపయోగిస్తుందని కూడా ఆయన చెప్పారు. 
 
“మా ప్రియమైన మాతృభూమి, గొప్ప ఇరాన్ నాగరికత పట్ల మా గొప్ప చారిత్రక కర్తవ్యాన్ని కొనసాగించకుండా ఏదీ మమ్మల్ని నిరోధించలేదు, నిరోధించకూడదు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, దేశ శ్రేయస్సును పరిరక్షించడానికి దౌత్యంతో సహా అన్ని సాధనాలను ఉపయోగించుకోవడానికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నిశ్చయించుకుంది,” అని ఆయన తెలిపారు. 
 
అణ్వాయుధాలు  అభివృద్ధి చేయరాదు 

ఇరాన్  అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని, వాటిని త్వరగా తయారు చేసే సామర్థ్యాన్ని కూడా పొందకూడదని అమెరికా కోరిందని జేడీ వాన్స్ తెలిపారు. ఇది అమెరికా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చలు ద్వారా దానిని సాధించడానికి ప్రయత్నించామని తెలిపారు. 
 
“వారి అణు కార్యక్రమాలు, శుద్ధి కర్మాగారాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. కానీ ఇరాన్ భవిష్యత్​లో కూడా అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే బలమైన సంకల్పంతో ఉందా?. అలాంటి నిబద్ధత మాకు ఇంకా కనిపించలేదు. మేం అన్నింటిపైనా చర్చించాము. వాటితో పాటు మధ్యలో ప్రస్తావనకు వచ్చిన ఇతర విషయాలపైనా చర్చించాం. కానీ ఇరాన్ మా నిబంధనలను అంగీకరించే స్థితిలో లేదు” అని తెలిపారు. 
 
“అధ్యక్షుడు మమ్మల్ని ఇక్కడికి పంపేటప్పుడు మంచి ఉద్దేశంతో ఒప్పందం కోసం శ్రమించమని చెప్పారు. మేం అదే చేసినా ఫలితం లేదు. మేం అధ్యక్షుడితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం. మేము ఇక్కడి నుంచి చిన్న ప్రతిపాదనతో వెళ్తున్నాం. మంచి అవగాహన ఉండాలనేది మా చివరి ఉత్తమ ఆఫర్‌. ఇరాన్ దానికి అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి” అని జేడీ వాన్స్​ వివరించారు. 
 
పాకిస్థాన్ ప్రధానమంత్రికి, ఫీల్డ్ మార్షల్ మునీర్‌ను జేడీ వాన్స్ ధన్యవాదాలు తెలిపారు. చర్చలు విఫలమైనా, పాకిస్తాన్ తన వంతు సహకారం అద్భుతంగా అందించిందని ప్రశంసించారు. చర్చలలో లోపాలు ఏవైనా ఉంటే అది పాకిస్థానీల వల్ల కాదు, ఇరు పక్షాలు మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించి ఒప్పందం కుదిర్చేందుకు చాలా ప్రయత్నించారని తెలిపారు. అటు ఇరాన్ కూడా పాక్​ను ప్రశంసించింది. చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది.