భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, ప్రజలు కూడా తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు కోరారు. దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోందని తెలిపారు. ప్రతి జిల్లాలో, ప్రతి ఇంట్లో, ప్రతి బూత్‌లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా తన నివాసంలో బూత్ నెం. 194 వద్ద బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆదివారం సగర్వంగా ఆవిష్కరించారు. బిజెపి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని ఆయన స్పష్టం చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త “దేశం ముందు – పార్టీ తర్వాత – స్వయం చివర” అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపిచ్చారు.
45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46లోకి అడుగుపెడుతున్న బిజెపి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు. ఒకప్పుడు జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, అనంతరం 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంతబలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని గుర్తు చేశారు.
విశాలమైన సభ్యత్వ బలం, దాదాపు 21 రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో పార్టీ భారతీయ రాజకీయాల్లో శక్తివంతమైన శక్తిగా అవతరించిందని చెప్పారు. ఈ అభివృద్ధి పార్టీపై, దాని నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈరోజు బీజేపీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును మలిచే ఒక శక్తివంతమైన జాతీయ ఉద్యమంగా నిలిచిందని రామచందర్ రావు స్పష్టం చేశారు.
నిజానికి, వాజపేయి, నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని తెలిపారు. వారి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భారతదేశ అభివృద్ధిని నిజమైన అర్థంలో ఆలోచించలేదని, అవినీతినే పాలనగా మార్చుకుందని ధ్వజమెత్తారు.

More Stories
ఫీజు రీయింబర్స్ పథకం ఎత్తివేత దిశగా ప్రభుత్వ అడుగులు
జనాభా లెక్కల్లో తెలిసిన భాషగా `సంస్కృతం’ చేర్చండి
ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో ప్రాణహాని.. రక్షణ కల్పించండి