ఐఎన్ఎస్ అరిదమాన్ అనే అణు సామర్ధ్యం కలిగిన సబ్‌మెరైన్ భారత నావికాదళంలోకి చేరింది. ఇది అణుశక్తి కలిగిన బాలిస్టిక్ మిస్సైల్స్‌ను మోసుకెళ్లగలదు. స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ నౌక ఐఎన్‌ఎస్ తారాగిరి (ఎఫ్41) శుక్రవారం భారత నౌకాదళంలో చేరింది. విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై నౌకను జాతికి అంకితం చేశారు.
ఐఎన్‌ఎస్ అరిదమాన్ ఇప్పటికే ఈ తరహా సామర్ధ్యం కలిగిన ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అగిఘాట్ అనే సబ్‌మెరైన్ల సరసన చేరింది. మొదటి సబ్‌మెరైన్ 2016లో, రెండోది 2024లో నావికాదళంలోకి చేరాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ భారతదేశానికి బలమైన నౌకాదళం అత్యవసరమని, దేశాభివృద్ధికి సముద్ర భద్రత ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశ వాణిజ్యంలో సుమారు 95 శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందని, ఇంధన భద్రత కూడా సముద్రాలపై ఆధారపడుతోందని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత నౌకాదళం ఇండియన్ ఓషన్ ప్రాంతంలో 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. సముద్ర మార్గాల్లో వస్తువుల రవాణా నిరంతరంగా సాగేందుకు, వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్ల భద్రత కోసం నౌకాదళం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ యుగంలో సముద్ర అడుగున ఉన్న ఇంటర్నెట్ కేబుళ్ల భద్రత కూడా అత్యంత ముఖ్యమైందని, వాటికి నష్టం కలిగితే ప్రపంచ వ్యవస్థపై ప్రభావం పడుతుందని రాజ్‌నాథ్ సింగ్తెలిపారు.
భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సముద్ర భద్రతను విస్తృత దృక్పథంతో చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో భారత నౌకాదళం ఎప్పుడూ ముందుండి సహాయక చర్యలు చేపడుతుందని తెలిపారు. నౌకాదళ శక్తిని తారాగిరి మరింత పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత నౌకాదళ అధిపతి దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ మారుతున్న సముద్ర భద్రతా పరిస్థితులకనుగుణంగా నౌకాదళం సిద్ధంగా ఉందని తెలిపారు.
దేశవ్యాప్తంగా 200కుపైగా ఎంఎస్‌ఎంఇల భాగస్వామ్యంతో నిర్మితమైన తారాగిరి నౌక భారత స్వయం సమృద్ధి, సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఇలా అణుసామర్ధ్యం కలిగిన సబ్‌మెరైన్స్ (జలాంతర్గాములు) ఉన్న దేశాలు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా మాత్రమే. షిప్ సబ్‌మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ (ఎస్‌ఎస్‌బీఎన్) ప్రోగ్రాంలో భాగంగా వీటిని తయారు చేస్తోంది ప్రభుత్వం. ఇవి దేశీయంగా తయారైన సబ్‌మెరైన్స్. 2009 నుంచి వీటిని తయారు చేస్తుంది.
ఐఎన్‌ఎస్ అరిదమాన్ ఇప్పటికే సముద్రంలో పలు ట్రయల్స్ పూర్తి చేసుకుంది. భారత్ ఇప్పటికే భూతల, గగనతల అణు సామర్థ్యం కలిగి ఉంది. అందుకే ఇప్పుడు సముద్ర జలాల్లోంచి అణ్వాయుధాల్ని ప్రయోగించే సామర్ధ్యంపై దృష్టిపెట్టింది. ఇంకోవైపు, ఈ రోజే తారాగిరి అనే మరో యుద్ధనౌక కూడా జలప్రవేశం చేసింది. దీంతో ఈ భారీ నౌక కూడా ఇప్పుడు నావికాదళంలోకి చేరింది.
ప్రాజెక్ట్ 17ఎ కింద రూపొందిన తారాగిరి యుద్ధనౌక నాలుగో ఫ్రిగేట్ కాగా, దీనిని ముంబయికి చెందిన మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. సుమారు 6,670 టన్నుల బరువుతో ఉన్న ఈ నౌకలో 75 శాతానికిపైగా స్వదేశీ పరికరాలు వినియోగించారు. తారాగిరి అత్యాధునిక స్టెల్త్ సాంకేతికతతో రూపొందించారు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా సముద్రంలో రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది.
ఈ నౌక అధిక వేగంతో ప్రయాణించడంతోపాటు దీర్ఘకాలం సముద్రంలోనే ఉండి యుద్ధ కార్యకలాపాలు నిర్వహించగలదు. ఇందులో బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ ఉపరితల క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల రక్షణ క్షిపణులు, ఆధునిక రాడార్, సోనార్ వ్యవస్థలు, జలాంతర్గాములను ఎదుర్కొనే టార్పెడో వ్యవస్థలు అమర్చారు. యుద్ధ కార్యకలాపాలకే కాకుండా సముద్ర భద్రత, దొంగల దాడుల నివారణ, తీర ప్రాంత పర్యవేక్షణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలలో కూడా ఈ నౌక కీలకపాత్ర పోషించనుంది.
More Stories
కేరళలో యూడీఎఫ్ గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ముస్లిం లీగ్!
సగంకు పైగా దేశాలలో `కఠినంగా’ పత్రికా స్వేచ్ఛ
దేశానికే ‘దిక్సూచి’ హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’