దండుగమారి వ్యవహారంగా మారిన ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’

దండుగమారి వ్యవహారంగా మారిన ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’
అన్ని స్థాయిల్లో శ్రద్దాసక్తులు లోపించడం, అందించే ఆహారం విషయంలో రుచి, నాణ్యత, పోషక విలువలు ఏవీ పట్టించుకోకపోవడం, శుచి-శుభ్రత సమయపాలన వంటివి గాలికి వదిలేయడం, భయంకరమైన నిర్వహణా వైఫల్యం, పై నుంచి నిఘా`తనిఖీలు మందగించడంతో ప్రజాసంక్షేమ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ నిర్వహణ  ఒక దండుగమారి వ్యవహారంగా తయారయిందని  పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 
 
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 30 వరకు, దాదాపు నెలరోజులపాటు జిహెచఎంసి పరిధిలో, జంటనగర శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న సగానికి పైగా క్యాంటీన్లను (శాస్త్రీయ శాంపిల్ 76/150) సర్వే బృందాలు ప్రత్యక్షంగా సందర్శించి తయారు చేసిన సమగ్ర సర్వే నివేదికను ‘పీపుల్స్ పల్స్ రిసర్చ్ సంస్థ’ బుధవారం విడుదల చేసింది. 
 
సంస్థ డైరెక్టర్, సమాచార హక్కు మాజీ కమీషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో ఈ సర్వే నిర్వహించారు.  సీనియర్ రీసెర్చర్లు జి.మురళీకృష్ణ, అఖిల, ప్రదీప్ తదితరులు ఈ సర్వే నిర్వహించారు. గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి  ఓ విధానపత్రమే లేకపోవడం, ఏ స్థాయిలో ఎవరి విధులు-బాధ్యతలు ఏమిటనే స్పష్టత ఇవ్వకపోవడం ఓ పెద్ద లోపంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
 
ప్రధాన లోపం ఈ పథకాన్ని చూసే దృష్టికోణంలోనే ఉందని గ్రహించారు. ‘అయిదు రూపాయలకు ఇంతకన్నా ఇంకేం పెడతాం?’ అన్న నిర్లక్ష్యంపెట్టే వాళ్లలో, ‘ఇంతకన్నా ఎవరైనా ఏం పెడుతారులే అయిదు రూపాయలకు’ అన్న క్షమ, ఉదాసీనత తినేవాళ్లలో…. కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దాంతో ఉన్నత లక్ష్యం నిలువునా నీరుగారిపోతోంది. పేరుకు ‘అయిదు’ రూపాయలే అయినా, అంతకు నాలుగయిదు రెట్ల అధికమొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పథకం నిర్వహకులకు చెల్లిస్తోంది. ఇది, అన్నం తినే అత్యధికులకు (80 శాతం మందికి) తెలియదని సర్వే వెల్లడించింది. 
 
డస్ట్‌బిన్‌లు లేక తిన్న విస్తర్లని సెంటర్లలోనో, రోడ్ల మీదో పడేస్తున్న సంఘటనలున్నాయి. పారిశుద్ధ్యలోపం ఒక ప్రధాన సమస్యగా ఉంది. మెజారిటీ ఇందిరమ్మ క్యాంటీన్లు పరిశుభ్రతకు ఆమడ దూరంలో ఉన్నాయి. తన బడ్జెట్ నుంచి నిధులు వెచ్చించే హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ఈ వ్యవస్థ పనితీరుపైన ఎటువంటి నిఘా, నియంత్రణ, తనిఖీలు ఏవీ నిర్వహించకపోవడం ఒక పెద్ద లోపంగా కనిపిస్తుంది. ఆహారం రుచిగా ఉండటం లేదు అన్నవారు సర్వేలో 70 శాతం మంది ఉన్నారు.
 
వారి నెలవారీ సమావేశాల్లోనూ ఇది చర్చకు రాదు. జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగాన్ని క్యాంటిన్లతో అనుసంధానించి శుచి-శుభ్రత విషయంలో చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండీ వారు చేస్తున్నదీ లేదు.   మ్యాన్‌పవర్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు సిబ్బంది ఒక్కరీతి జీతాలివ్వకపోవడం, అదీ సకాలంలో ఇవ్వకపోవడం వంటివి వారి పనితీరును ప్రభావితం చేస్తున్నాయని కనుగొన్నారు.
 
ఈ వ్యవస్థ నిర్వహణలో భాగంగా వారు నియమించిన కాంట్రాక్టర్లు గానీ, క్యాంటీన్లలో పనిచేసే సిబ్బందికి గానీ శిక్షణ లేదు. క్రమశిక్షణ లేదు. కొన్ని సెంటర్లలో వారి ప్రవర్తన గౌరవప్రదంగా ఉండటంలేదు. 

పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది:

1. ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ సబ్సిడీ భోజన పథకాన్ని సమూలంగా మారుస్తూ, ఒక విధాన పత్రం-నిర్దిష్ట విధివిధానాలు, పథకంలో భాగస్వాములయ్యే వారి విధులు-బాధ్యతల్ని నిర్దేశిస్తూ పున:ప్రారంభించడం మంచిది.

2. ఆహారం రుచి, నాణ్యత, పోషకాలు భారత ఆహార భద్రత`ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పౌష్ఠికాహార సంస్థ (ఎన్‌ఐఎన్)తో సంప్రదించి ఏ రోజు, ఏ పూట, ఏ రకమైన ఆహారం ఎంత పరిమాణంలో ఇవ్వాలో ‘మెనూ’ ఖరారు చేయాలి.

3. లక్షల రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ‘కంటెయినర్‌’లోని అన్ని సదుపాయాలు సవ్యంగా పనిచేసే విధంగా, తగు రిపేర్లతో వెంటనే చర్యలు తీసుకోవాలి. అవన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి. ప్రతి క్యాంటీన్ నిర్వహణను కంటెయినర్‌లోకి మార్చాలి. ప్రతి చోట సీసీ కెమెరాలుండాలి.  ఫిర్యాదు బాక్స్‌లు, టోల్‌ఫ్రీ నంబర్ స్పష్టంగా కనిపించే చోట ఏర్పాటు చేయాలి.

4. నగరంలో, శివారుల్లో (గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో) ని వివిధ చోట్ల క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సెంటర్లను పున:సమీక్ష చేసి, అవసరమైన, అందరికీ అనువైన చోట్ల వాటిని ఏర్పాటు చేసేలా చర్యలుండాలి.

5. ఆహారం తయారీ, పంపిణీ, క్యాంటీన్ల నిర్వహణను ముందు ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ‘సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌’లకు ఇచ్చి, అవి విజయవంతం అవడాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించాలి.

6. క్యాంటీన్లలో శుచి-శుభ్రతను పెంచి, ప్రమాణీకరించాలి. అక్కడ సిబ్బందిని పెంచాలి. వారికి తగిన శిక్షణ, డ్రెస్‌కోడ్, కనీస వేతనాలు లభించేలా తగు చర్యలు తీసుకోవాలి.

7. ఇందిరమ్మ క్యాంటీన్ల ఆహార సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి, నెలలో కనీసం రెండుసార్లు (పక్షానికోమారైనా) సమీక్షా సమావేశం జరిపించాలి. ప్రతి సమావేశంలోనూ అంతకు ముందరి సమావేశ నిర్ణయాలపై చర్యల నివేదిక ఉండాలి. తక్కువ కాల వ్యవధితో నిరంతరం క్యాంటీన్‌ల తనిఖీలు ఉండేలా చూసుకోవాలి.

8. మంత్రుల నుంచి కార్పొరేటర్ల వరకు ప్రజాప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, స్వయంగా వారక్కడ టిఫిన్/భోజనం చేయాలి. వారి దృష్టికి వచ్చిన అంశాలను వెంటనే ఆహార సలహాసంఘంకు తెలియజేయాలి. అందు అనుగుణంగా తగు చర్యలకు సలహాసంఘం అవసరమైన సిఫారసులు అధికారులకు చేసి, అవి ఖచ్చితంగా అమలయ్యేట్టు చూడాలి.

9. పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సబ్సిడీ భోజన పథకంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారితో సమగ్ర సమీక్ష జరిపించి, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి.

10. ‘ఆకలి’ లేని వ్యవస్థ కోసం, నిరుపేదలకు నామమాత్రపు ఖర్చు (రూ.5ల) కే టిఫిన్/భోజనం అందించే గొప్ప ఆశయంతో చేపట్టిన ఈ పథకం మంచి-చెడులను, విజయ`వైఫల్యాలను, సాధకబాధకాలను సంపూర్ణంగా తెలుసుకొని, తగు సవరణలతో తిరిగి చేపట్టడానికి వీలుగా ఒక లోతైన, సమగ్రమైన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.

ఆకలి లేని వ్యవస్థ కోసం 2014లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించగా,   తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించింది. నామ మాత్రపు ఖర్చు, అయిదు రూపాయలకే ఓ పూట భోజనం పెట్టి కడు నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ క్యాంటీన్ల’ను ఏర్పాటు చేసింది. అధిక మొత్తం సబ్సిడీతో దీన్ని చేపట్టింది. 

మొదట 8 సెంటర్లతో మొదలైనా ఇప్పుడు పేరు మారి, ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ పేరిట జిహెచ్‌ఎంసి పరిధిలో, జంటనగరాల శివార్లలో కలిపి ఆ సెంటర్ల సంఖ్య 150కి చేరింది. మధ్యాహ్నం అందించే భోజనానికి తోడు, ఉదయం 5 రూపాయలకే టిఫిన్ (కొన్ని చోట్ల) అందించే సౌకర్యాన్ని  ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరిమితంగా కొన్ని చోట్ల (ముఖ్యంగా ఆస్పత్రుల వద్ద) రాత్రి పూట‌ భోజనం కూడా పెడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్లు  ఇదివరకున్న డబ్బాల స్థానంలో పలు సౌకర్యాలతో ‘కంటెయినర్‌’లను సమకూర్చే నిర్ణయాన్ని 2025లో ప్రభుత్వం తీసుకొని పథకాన్ని కొంత విస్తరించింది.