తెలంగాణలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

తెలంగాణలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ‘తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్-2026’ పేరుతో ఐసీఎంఆర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2026 చివరి నాటికి కొత్తగా 46,762 కేసులు నమోదవుతాయని అంచనా వేయగా, ఇందులో మహిళల సంఖ్య (25,510) పురుషుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 
 
గత దశాబ్ద కాలంలో కేసుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పొగాకు వాడకం, మారుతున్న జీవనశైలి, ఊబకాయం వంటి కారణాలు ఈ మహమ్మారి వ్యాప్తికి ప్రధాన కారకాలుగా మారుతున్నాయి.  వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే స్క్రీనింగ్ పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన లోపించడం పెను ముప్పుగా పరిణమిస్తోంది. 
 
నివేదిక ప్రకారం, మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ రేటు కేవలం 0.3 శాతం మాత్రమే ఉండటం అత్యంత ఆందోళనకరం. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు 3.3 శాతం, నోటి క్యాన్సర్ పరీక్షలు 2.5 శాతం మంది మహిళలు మాత్రమే చేయించుకుంటున్నారు.  30-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో కనీసం 4 శాతం మంది కూడా పరీక్షలకు ముందుకు రాకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాతే ఆస్పత్రులకు చేరుతున్నారు.
ఇది చికిత్సను క్లిష్టతరం చేయడమే కాకుండా మరణాల రేటు పెరగడానికి కారణమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్లలో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే కేసులే సింహభాగం ఉంటున్నాయి.  పురుషుల్లో 58.8 శాతం, మహిళల్లో 29.7 శాతం క్యాన్సర్లు కేవలం పొగాకు వల్లే సంభవిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.  ముఖ్యంగా నోటి, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్లు అధికంగా వెలుగుచూస్తున్నాయి.
వీటికి తోడు మధుమేహం, రక్తపోటు, పీసీఓడీ వంటి హార్మోన్ల సమస్యలు కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి.  ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా స్క్రీనింగ్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, పొగాకు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడమే ఈ మహమ్మారి నుండి ప్రాణాలను కాపాడుకునే ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.