ప్రైవేటు వ్యక్తులకు లక్షన్నర ఎకరాల ఆలయ భూములా?

ప్రైవేటు వ్యక్తులకు లక్షన్నర ఎకరాల ఆలయ భూములా?
* సర్వే నంబర్లు కలిసిపోయాయంటూ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై బిజెపి ఆగ్రహం  

దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఏపీ బిజెపి అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం అంటూ ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.

33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానంను కూడా ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.

హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయని,  అభివృద్ధి పేరుతో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుందని, లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి మళ్లించడం, ఆక్రమించడం జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలన్నది బిజెపి స్పష్టమైన అభిప్రాయం అని మాధవ్ తేల్చి చెప్పారు.

ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం అంటూ ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుందని హెచ్చరించారు.  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని పేర్కొంటూ ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలని భక్తులు కోరుతున్నట్లు మాధవ్ స్పష్టం చేశారు.  

ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోందని ఆయన విమర్శించారు. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని హెచ్చరించారు.

దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాధవ్ ఈ క్రింది డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు 

* దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
* దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
* దీర్ఘకాళిక లీజుల కాకుండా స్వల్పకాలిక లీజులపై దృష్టి పెట్టాలి..
* ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం పునఃపరిశీలించాలి.
* అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.
* దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.
* ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.
* సిజిఎఫ్ నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరుద్దరించాలి.* అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.
* హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.

దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుందని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  కాగా, ఇటీవల ఆకివీడు రామాలయ పునఃనిర్మాణంలో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా డిప్యూటీ స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం కొందరికి తీవ్రమైన గాయాలపై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుందని  పివిఎన్ మాధవ్ తెలిపారు.

ఈ సంఘనను ఖండిస్తూ ఇటువంటి అల్లర్లు ప్రోత్సహించే సూత్రదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు అని చెబుతూ ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలని చెప్పారు.  ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు.   

హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థలో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం, ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై  రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ లలో వినతిపత్రాలను సమర్పించినట్లు మాధవ్ వెల్లడించారు.  బిజెపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం “జనతా వారధి”  కార్యక్రమం ద్వారా చేస్తున్న గ్రామ నగర పర్యటనల్లో హిందూ ఆలయాలు ధర్మకర్తలు, భక్తులలో ఆందోళనలు కనిపించాయని మాధవ్ తెలిపారు