ఏపీ, ఒడిశాలకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు

 
ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిశా రాష్ట్రాల‌కు తీవ్ర తుపాను ముప్పు పొంచివున్న‌ద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారి తీరంవైపు దూసుకొస్తోంద‌ని, ఈ తుపాను అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్ల‌డించింది. కాబ‌ట్టి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఏపీకి హెచ్చ‌రిక జారీచేసింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్‌ సూచించిన ‘అర్నబ్‌’ పేరు పెట్టారు.

గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం ముందుకు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని, సోమవారానికి తుపానుగా బలపడతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.  ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీచేశారు.

ఒడిశా స‌ర్కారు కూడా తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ది. తీరం వెంబ‌డి విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బందిని భారీగా మోహరించింది. తీర‌ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న‌ది.  అర్నబ్‌ తీవ్ర తుపాను కారణంగా 12 జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కాగా ఐఎండీ ఆదివారం ఉద‌యం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ప్ర‌స్తుతం బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న‌ది. ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న‌ది. ఈ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, అక్టోబర్ 26న తుపానుగా, 27న తీవ్ర తుపానుగా, 28 నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది.

అక్టోబర్ 28న‌ ఉదయం తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేప‌థ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తుపాను సన్నద్ధతపై సీఎం చంద్రబాబు  సీఎస్ సాయి ప్రసాద్‌తో, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్ర‌మ‌త్తం చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

మరోవంక, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. వర్షాల కారణంగా ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు దెబ్బతిని, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఊటీ, కొడైకెనాల్‌ వంటి పర్యాటక ప్రాంతాలను మూసివేసి వేశారు. పర్యాటకులు రావొద్దని అధికారులు సూచించారు. సముద్రంలో అలజడి కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, కళ్లకుర్చిలో అత్యధికంగా 17 సెం.మీ. వర్షం కురిసింది. పెరంబలూరులో 15 సె.మీ. ధర్మపురిలో 14 సెం.మీ. వర్షం కురిసింది. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

About The Author