‘మ‌న్ కీ బాత్‌’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థ‌యాత్ర

* దీపావళికి ముందు ‘వోకల్ ఫర్ లోకల్’ను బలోపేతం చేయండి

నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్‌’ ప‌న్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ  తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయాణం తనకు ఒక ‘తీర్థయాత్ర ’ లాంటిదని, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సామాన్యులు చేస్తున్న అసాధారణమైన కృషిని గౌరవించుకునే మార్గమని తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచి స్ఫూర్తినిచ్చిన శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పన్నెండేళ్ల క్రితం విజయదశమి పర్వదినాన మనం ‘మన్ కీ బాత్’ ప్రారంభించామ‌ని, అప్పటి నుంచి మన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతోందని ప్ర‌ధాని గుర్తుచేశారు. ఈ ప్రయాణంలో మీరంతా సహ ప్రయాణికులుగా, స్ఫూర్తిదాతలుగా ఉన్నారని శ్రోత‌ల‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. శతాబ్దాలుగా మన దేశంలో తీర్థయాత్రల సంప్రదాయం ఉందని, దేశ ప్రజల కృషిని దగ్గర నుంచి అర్థం చేసుకోవడానికి, వారి సేవలకు వందనం చేయడానికి ‘మన్ కీ బాత్’ త‌న‌కు ఒక తీర్థయాత్ర కన్నా తక్కువేమీ కాదని చెప్పారు. 

సమాజం కోసం, దేశం కోసం జీవించే వ్యక్తులు స్వయంగా పుణ్యక్షేత్రాల వంటివారని ప్రధాని కొనియాడారు. దేశంలోని సామాన్య ప్రజల కృషినీ, ధైర్యాన్ని, అంకితభావాన్ని, సేవా స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ‘మన్ కీ బాత్’ ఒక అద్భుతమైన అవకాశమని ప్రధాని తెలిపారు. ఈ ప‌న్నెండేళ్ల‌లో సమాజం దృష్టికి రాని ఎందరో మహానుభావుల అసాధారణమైన పనులను ఈ కార్యక్రమం ద్వారా దేశం ముందుంచామని గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమం ద్వారా తాను ఒకరకంగా మన దేశ ప్రజల శక్తికి నివాళులు అర్పిస్తున్నానని చెబుతూ దేశంలోని ప్రతి కుటుంబంతోనూ అనుబంధం పెంచుకునే అవకాశం నాకు లభించిందని చెప్పారు. చాలామంది ప్రజలు తనకు సందేశాలు పంపుతూ ‘మన్ కీ బాత్’ వింటున్నప్పుడు, తమ మధ్యలో ఒక కుటుంబసభ్యుడిగా కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని చెబుతుంటారని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. 

“శ్రోతలైన మీ అందరి ఆత్మీయత, అనురాగం నాకు నిజంగా అమూల్యమైన ఆస్తి” అని ప్రధాని భావోద్వేగంగా పేర్కొన్నారు. తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న విజయదశమి రోజున ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌లలో ప్రసారమైంది. అప్ప‌టి నుంచి ప్ర‌తి నెల చివ‌రి ఆదివారం ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూ వచ్చింది. 

కాగా, దేశమంతా దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో, స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పౌరులను కోరారు. ప్రజలు షాపింగ్ చేసేటప్పుడు స్వదేశీ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ‘వోకల్ ఫర్ లోకల్’ అనే స్ఫూర్తి బలంగా నాటుకుపోయిందని  తెలిపారు.  మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు స్థానిక, స్వదేశీ ఉత్పత్తులకే అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ స్ఫూర్తి వల్లే మన దేశీయ ఉత్పత్తులు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరుకుంటున్నాయని చెప్పారు.

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక తయారీదారులు, కళాకారులకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు.  పంజాబ్‌లో సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల పునరుద్ధరణ గురించి ప్రస్తావిస్తూ ‘ఖేతీ విరాసత్ మిషన్’ అనే సంస్థ సేంద్రియ వ్యవసాయానికి కొత్త జీవం పోయడం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ‘నవ్​-త్రింజన్’ అని పేరు పెట్టారని చెప్పారు.   

అలాగే, ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో హేవల్ నదికి కొత్త జీవం పోయడానికి ప్రజలు ఏకతాటిపైకి రావడం గురించి మోదీ ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాల క్రితం, హేవల్ నదిలో నీరు తగ్గిపోవడం ప్రారంభమైందని, దాని చుట్టూ ఉన్న సహజ నీటి వనరులు కూడా ఎండిపోతున్నాయని ఆయన తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో, హేవల్ నదిని కాపాడటానికి స్థానిక యంత్రాంగం, గ్రామస్థులు కలిసి ఒక ప్రచారాన్ని ప్రారంభించారని మోదీ చెప్పారు. 

About The Author