అమరావతి చట్టబద్ధతకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం 

అమరావతి చట్టబద్ధతకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం 
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శనివారం ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర శాసనసభ ఓ తీర్మానం ఆమోదించింది.  ఉదయం సభ ప్రారంభం కాగానే తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5లోని సబ్‌సెక్షన్‌ 2లో ‘ఎట్‌ అమరావతి (అమరావతిలో)’ అన్న పదాన్ని చేర్చాలని తీర్మానించారు.
 
సెక్షన్‌ 5కి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ‘ఏపీ సీఆర్‌డీఏ చట్టం-2014 ప్రకారం నోటిఫై చేసిన కేపిటల్‌ సిటీ ప్రాంతాలతో సహా అమరావతి’ అని చేర్చాలని ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులు  సంపూర్ణ మద్దతు తెలిపారు.  
 
అలాగే అమరావతి అనగా ఎపి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎపిసిఆర్‌డిఎ) చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి అనే పదాలను కూడా తీర్మానంలో చేర్చారు.  కేంద్ర కేబినెట్‌ సమ్మతి తర్వాత ఈ తీర్మానం పార్లమెంట్‌ ముందుకు వెళుతుంది. అక్కడ ఆమోదం పొందాక ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతుంది. 
 
మూడు ముక్కలాట లాంటి వైసీపీ వికృత క్రీడకు తావు లేకుండా రాజధాని మార్చాలన్న ఆలోచన చేయడానికి కూడా వీల్లేకుండా అమరావతికి చట్టభద్రత వస్తుంది.  తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించి, వెంటనే తీర్మానం కాపీని సిఎస్‌కు, కేంద్రానికి పంపించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదించేలా కేంద్ర హోం శాఖకు, రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు అమరావతిని రాజధానిగా చట్టబద్దత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని శాసనసభ అధికారులు పంపారు. 
 
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 23 మంది చర్చలో పాల్గొన్నట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. తీర్మానంపై సిఎం చంద్రబాబు నాయుడు ముగింపు ఉపన్యాసం చేస్తూ పార్లమెంటులో ఈ చట్టం ఆమోదం పొందితే భవిష్యత్‌లో అమరావతిని ఎవ్వరూ కదలించలేరని తెలిపారు. 
 
అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు. రైతులు ఇచ్చింది భూములు కాదని, రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చారని చెప్పారు. స్వయం సమృధ్ధి ప్రాజెక్టుగా అమరావతి నిర్మితం అవుతుందన్నారు. 2028కి పనులు అన్నీ పూర్తి చేసి అమరావతికి రూపం తీసుకువస్తామని, 2027 నాటికి ట్రంక్‌ రోడ్లు, లేఅవుట్స్‌ సహా వివిధ మౌలిక సదుపాయాలు పూర్తి అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
అమరావతి ఆంధ్రప్రదేశ్‌ గుండె, ఆంధ్రప్రదేశ్‌ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తామని వివరించారు. భవిష్యత్‌ నగరం అమరావతి, బ్లూ, గ్రీన్‌ నగరంగా ఇది నిర్మితం అవుతుందని చెప్పారు.