విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురు అరెస్టు

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురు అరెస్టు

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మైనర్‌ కూడా ఉన్నారు. కేసులో ఏ7గా ఉన్న ఢిల్లీ వాసి అహ్మద్, ఏ9గా ఉన్న రాజస్థాన్ వాసి జీషాన్, ఏ10గా ఉన్న బంగాల్ వాసి మీరా ఆసిఫ్ అలీ, ఏ12గా ఉన్న మహారాష్ట్ర వాసి షారుక్ ఖాన్, ఏ13గా ఉన్న మహారాష్ట్రవాసి రెహమాన్‌ను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురిని విజయవాడ సీఎంఎం కోర్ట్‌ జడ్డి ముందు హాజరుపర్చగా వారికి ఏప్రిల్‌ 6 వరకూ న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. 

సామాజిక మాధ్యమాల ద్వార ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విజయవాడ, హైదరాబాద్‌, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారిని అరెస్టు చేసిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. భారతదేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన మహమ్మద్‌ రహమతుల్లా షరీఫ్‌ను విదేశీ హ్యాండ్లర్లు ప్రేరేపించినట్లు తేల్చింది.

విదేశీ హ్యాండర్ల మార్గదర్శకాల మేరకే రహమతుల్లా షరీఫ్‌ మిర్జా సొహైల్‌ బేగ్, మహమ్మద్‌ దానిష్‌లతో కలిసి యువతను జిహాద్‌ దిశగా సిద్ధం చేసినట్లు సీఐ సెల్‌ గుర్తించింది. వీరంతా సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు నిర్ధారించింది. పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకొని ఆ దిశగా సిద్ధమవుతున్నట్లు గుర్తించింది.

అలాగే భారత్‌లో విధ్వంసాలకు పాల్పడేందుకు, జిహాదీ శిక్షణ కోసం పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌కు వెళ్లేందుకు సిద్ధం కావాలంటూ విదేశీ హ్యాండ్లరైన అల్‌-హకీం షుకూర్‌ రహమతుల్లా షరీఫ్‌ను ప్రేరేపించినట్లు వెలుగు చూసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులు మహ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహ్మద్ డానిష్​లను విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

కాగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల్లో నిర్వహించే ఖాతాలు, వెబ్‌సైట్లు వంటి వాటిని యువత అనుసరించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇవి విద్వేషపూరిత భావజాలాన్ని ప్రేరేపించి దేశ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, సామాజిక మాధ్యమాల ద్వారా యువతను తప్పుదారి పట్టిస్తున్న దేశ ద్రోహ శక్తుల నుంచి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.