డిజిపి దృష్టికి చండూరులో బిజెపి నాయకులపై హత్యాయత్నం 

డిజిపి దృష్టికి చండూరులో బిజెపి నాయకులపై హత్యాయత్నం 

నల్గొండ జిల్లా చండూరులో బిజెపి నాయకులపై జరిగిన హత్యాయత్నాన్ని డీజీపీ దృష్టికి బిజెపి నాయకులూ తీసుకెళ్లారు.  రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ దాడిలో బిజెపి నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలైనప్పటికీ, పోలీసులు నిందితులకు అనుకూలంగా బలహీనమైన సెక్షన్లతో కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. 

అలాగే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై నిరసన వ్యక్తం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం పోలీసుల పక్షపాతానికి నిదర్శనమని మండిపడ్డారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడి పట్ల డీఎస్పీ అనాగరికంగా వ్యవహరించిన తీరును ఫిర్యాదులో పేర్కొన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ, ప్రతిపక్ష బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డీజీపీని బిజెపి బృందం డిమాండ్ చేసింది. ఈ బృందంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, సీనియర్ నాయకులు మారుతీ కిరణ్, రామకృష్ణ, సీనియర్ న్యాయవాది ఆంథోనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చండూరు మున్సిపల్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  తూళ్ళ వీరేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన బాధిత కార్యకర్తల కుటుంబాలను బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా. గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి పరామర్శించారు.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందనే అక్కసుతో, అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు మద్యం మత్తులో గుండాల్లా ప్రవర్తిస్తూ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ విశ్రమించదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు.