వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే తెలంగాణ బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) డిమాండ్ చేసింది. గత సంవత్సరం బడ్జెట్ లో 7 శాతం నిధులు మాత్రమే కేటాయించినా, వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదని రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల. రాంబాబు తెలిపారు.
చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందని రాంబాబు విమర్శించారు. తెలంగాణలో 90% మంది విద్యార్థులు బిసి, ఎస్సి, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని, వారందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారని ఆయన చెప్పారు.
కానీ ఈ ప్రభుత్వం సుమారు రూ. 9500 కోట్ల బకాయిలతో పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని, విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బందుకు పిలపునిచ్చాయని, అనేక ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయాలకు వాటి బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ పెంచకుండా ప్రైవేటు యూనివర్సిటీల వలె విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి దాపురించిందని ఏబీవీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
అన్ని యూనివర్సిటీల్లో స్వీయ ఆర్థిక స్వావలంబన పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచి విద్యార్థుల రక్తం తాగుతున్నారని తెలిపారు. ఉదాహరణకు, కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్ రూ. 400 కోట్లు అయితే ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్ రూ. 140 కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు. గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో 110 మంది పేద పిల్లలు మరణించారని, అయినా ఈ ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదని ధ్వజమెత్తారు.
ఆర్బాటంగా ఏర్పాటు చేసిన కామన్ మెనూ కార్యక్రమం అటకెక్కిందని, రోజుకో చోట ఫుడ్ పాయిజన్ నిత్య కృత్యం అయ్యిందని రాంబాబు తెలిపారు. చాలా వరకు గురుకులాలు, డిగ్రీ కళాశాలలు, ఐటిఐ కళాశాలలు పక్కా భవనాలు లేక అందులో చదివే పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో ఇది వరకే మంజూరు అయినా టీచింగ్ పోస్టులు 2878 అయితే, ప్రస్తుతం కేవలం 753 మంది మాత్రమే టీచింగ్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నదని తెలిపారు.
అంటే 70% ఖాళీలతో కాలం వెళ్లదీస్తున్నాయని, 3 స్పెషలైజ్డ్ యూనివర్సిటీల్లో 50% ఖాళీలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం, యూనివర్సిటీ లకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకునే పాలకమండళ్ళను నియమించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రం లోని 149 డిగ్రీ కళాశాలల్లో 4059 టీచింగ్ పోస్టులు మంజూరు అయితే 2598 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఐటిఐ, వృత్తి విద్యా కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇప్పటికి గెస్ట్ లెక్చరర్లే దిక్కని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని సంవత్సర కాలం దాటినా 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రాంబాబు విమర్శించారు.
గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్ తమ ఖాతాలో వేసుకుంటున్నదని దుయ్యబట్టారు. యువ వికాసం పేరుతోరూ. 5 లక్షల కార్డులను యువతకు జారీ చేస్తామని, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు,ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు దండుకుని ఇప్పుడు వెర్రి వేషాలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని దుయ్యబట్టారు.
ఇటీవల అశాస్త్రీయంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మా కళాశాలలలో భారీగా పెంచిన ఫీజులు పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తాయని పేర్కొంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నేత డిమాండ్ చేశారు. అర్బన్ నక్సల్స్ మనస్తత్వం ఉన్న సభ్యులు ఉన్న విద్యాకమిషన్ ఇచ్చిన నివేదిక విద్యారంగాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్లే విధంగా ఉందని మండిపడ్డారు. లోపభూయిష్టమైన విద్యాకమిషన్ నివేదికను ప్రభుత్వం చెత్తబుట్టలో వేయాలని స్పష్టం చేశారు.

More Stories
బెంగాల్లో రెండు విడతలు, నాలుగు చోట్ల ఒకే దశలో పోలింగ్
రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో కాల్పుల కలకలం
ప్రముఖ తమిళకవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం