హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించి అతన్ని ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అతను శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం .ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణా రెడ్డికి ఎస్ఆర్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
లైంగిక ఆరోపణలపై ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ తనపై చేసిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తమంటూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకముందని, న్యాయం తప్పక గెలుస్తుందని తెలిపారు. వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్ట్ చేయాలంటూ కోరారు. తమ్ముడి ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళా ఐపీఎస్ ట్రైనీ చేసిన ఆరోపణలు నిజమని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. ఈ కమిటీ నిర్ణయంతో జాతీయ పోలీస్ అకాడమీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు.
ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఉదయ్ కృష్ణారెడ్డిపై కావాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి ఐపీఎస్ స్థాయికి చేరుకున్న తన అన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని చెప్పారు.
నేషనల్ పోలీస్ అకాడమీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక మహిళా ట్రైనీని గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి కత్తితో బెదిరించడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. మహిళా ట్రైనీ చేసిన ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు, చాటింగ్‌లు, వీడియోలు ఉదయ్ వద్ద ఉన్నాయని చెబుతూ అవి వెలుగులోకి వస్తే నిజాలు బయటపడతాయని ప్రణయ్ పేర్కొన్నారు.
ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెం. ఇతడి చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. అప్పటి నుంచి నాన్నమ్మ దగ్గరే ఉంటూ ప్రభుత్వ బడిలోనే చదివాడు. కూరగాయలు విక్రయిస్తూ నాన్నమ్మకు ఆసరాగా ఉండేవాడు. 2013లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి 2018 వరకు విధులు నిర్వర్తించాడు. సివిల్స్‌కు సన్నద్ధమై, పరీక్షల్లో నాలుగుసార్లు వరుసగా విఫలమైనా పట్టు వదలకుండా ప్రయత్నించాడు. ఐదోసారి 360వ ర్యాంకు పొంది ఇతరులకు ప్రేరణగా నిలిచాడు.

More Stories
దివ్యాంగులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి
కరవుతో రైతులు చస్తుంటే కేబినెట్ రద్దు చేసి ఢిల్లీకి పారిపోయిన రేవంత్
మెదక్ జిల్లాలో వెలుగులోకి 1,100 ఏళ్ల నాటి గజలక్ష్మి శిల్పం