నీట్ పేపర్ ‘లీక్’, రామ మందిరంలో జరిగిన విరాళాల దొంగతనం ఆరోపణలలో దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించడంతో, సోమవారం నాడు వర్షాకాల సమావేశాల మొదటి రోజున లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించడంతో, ప్రశ్నోత్తరాల సమయం జరుగుతున్న తరుణంలో స్పీకర్ ఓం బిర్లా సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేయవలసి వచ్చింది.
ఆరుగురు మాజీ ఎంపీల మరణంపై సంతాప తీర్మానాలను చదువుతున్నప్పుడు ఇద్దరు సభ్యులు నినాదాలు చేయడంపై బిర్లా అభ్యంతరం తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదని హితవు చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు, నిరసనలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా వేశారు.
కార్యకలాపాలు వాయిదా పడటానికి ముందు, భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచిన ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. అంతకుముందు, ప్రశ్నోత్తరాల సమయంలో నినాదాలు చేయవద్దని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
“పార్లమెంటు ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక. దయచేసి మీరు నియమాలను పాటించాలని నేను కోరుతున్నాను. పోస్టర్లు, ప్లకార్డులు తీసుకురావద్దు. ఇది ప్రశ్నోత్తరాల సమయం. నినాదాలు చేయడం సరికాదు. అలా చేస్తే సభ సజావుగా పనిచేయకుండా అడ్డుకుంటారు,” అని మధ్యాహ్నం వరకు కార్యకలాపాలను వాయిదా వేసే ముందు బిర్లా తెలిపారు.
మాజీ ఎంపీలు నాదెండ్ల భాస్కరరావు, ఓంవతి దేవి, సుధాంగ్షు సీల్, మేజర్ జనరల్ బి.సి. ఖండూరి (రిటైర్డ్), కె.పి. ధనపాలన్, ప్యారే లాల్ సంఖ్వార్‌ల సంతాప తీర్మానాలతో లోక్‌సభ రోజును ప్రారంభించింది. స్పీకర్, ఖతార్ ఫాదర్ అమీర్ అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీకి కూడా నివాళులర్పించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
జీరో అవర్‌ను చేపట్టాలని సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులకు ప్రతిపక్ష సభ్యుల నుండి సానుకూల స్పందన రాలేదు. సభాపతిగా ఉన్న దిలీప్ సైకియా, సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 1 గంటకు సభ సమావేశమైనప్పుడు, ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభాపతిగా ఉన్న సైకియా, ప్రతిపక్ష సభ్యులను వారి వారి స్థానాలకు తిరిగి వెళ్లి సభా కార్యకలాపాలలో పాల్గొనాలని కోరారు.
“వివిధ అంశాలపై చర్చలకు సభ సిద్ధంగా ఉంది. కానీ మీకు ఆసక్తి లేదు. మీరు ప్రజల సమస్యలను చర్చించాలనుకోవడం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు పదేపదే సభకు అంతరాయం కలిగిస్తున్నారు. మీరు బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు, ఇది ఆమోదయోగ్యం కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో, సైకియా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ప్రతిపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు కూడా వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ వెలుపల, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పదేపదే జరుగుతున్న అంతరాయాలను విమర్శిస్తూ, పార్లమెంట్ చర్చలు, జవాబుదారీతనం కోసమేనని తెలిపారు. “అన్ని సమస్యలపై వివరంగా చర్చించేందుకే పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతిదానికీ ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటుంది. పార్లమెంట్ సజావుగా పనిచేయాలని, సభ్యులు తమ సమస్యలను సభలో లేవనెత్తాలని మేము కోరుకుంటున్నాము. కానీ వారు అంతరాయం కలిగిస్తే, అది సరికాదు,” అని ఆమె హితవు చెప్పారు.
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఇతర పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ నుండి జంతర్ మంతర్ వరకు పాదయాత్ర చేశారు. బాధిత విద్యార్థులతో సంప్రదించడానికి కేంద్రం నిరాకరిస్తోందని ఆరోపిస్తూ, ప్రతిపక్షం యువతకు గట్టిగా అండగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.
పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిల్లల మరణాలను గుర్తించడంలో విఫలమవడం, నిరసన చేస్తున్న విద్యార్థులతో సంప్రదించడానికి నిరాకరించడం ద్వారా ప్రభుత్వం “అహంకారం” ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. పదేపదే పరీక్ష పత్రాల లీకేజీలకు బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టలేదని ఆరోపిస్తూ, “ఇది ప్రభుత్వం కాదు, అహంకారం” అని యాదవ్ ధ్వజమెత్తారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించిన ఆడిట్‌లో 20కి పైగా పరీక్షా పత్రాల లీకేజీలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ప్రమేయం ఉన్నవారికి బీజేపీతో రాజకీయ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
సమావేశానికి ముందు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, రామ మందిర విరాళాలలో జరిగిన అవకతవకలు, పరీక్షా పత్రాల లీకేజీలు, ఇథనాల్-బ్లెండింగ్ విధానం, ప్రజలను ప్రభావితం చేసే ఇతర విషయాలతో సహా పలు అంశాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, ఇండియా కూటమి జవాబుదారీగా నిలబెడతాయని ప్రకటించారు.

More Stories
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు
తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సీజేపీ ‘చలో పార్లమెంట్’
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ బలవన్మరణం