జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ అధినేత ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. జమ్ములో ఓ వివాహానికి హాజరైన ఆయనపై ఒక వ్యక్తి బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. నిందితుడు తుపాకీని ఫారూక్‌కు గురిపెట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తున్నది. ఆ సమయంలో ఫారూక్ వెంట ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి కూడా ఉన్నారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తిని రక్షణ సిబ్బంది వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో చౌదరికి స్పల్ప గాయం కాగా, ఫారూక్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా తప్పించుకున్నారు. నిందితుడు జమ్ము నివాసి, గనుల వ్యాపారి కమల్ సింగ్ జన్వల్గా గుర్తించారు. నిందితుడు ఈ కాల్పులకు ఎందుకు పాల్పడిందీ వివరాలు తెలియరాలేదు.
పెళ్లి నుంచి బయటకు వెళ్తుండగా దుండగుడు అబ్దుల్లా వీపుపై కాల్పులు జరిపాడని చౌదరి పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను ఆయన విమర్శించారు. స్థానిక పోలీసుల “పూర్తి నిర్లక్ష్యం” వల్లే ఈ ప్రమాదం జరిగిందని, భద్రతా వలయం ఏర్పాటు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించే ముందు అతని సొంత భద్రతా బృందం పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
తన తండ్రిపై జరిగిన కాల్పులపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జడ్ ప్లస్, ఎన్ఎస్జీ రక్షణ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇలా హత్యాయత్నానికి పాల్పడటం పలు సందేహాలను కలిగిస్తున్నదని తెలిపారు.

More Stories
స్పీకర్ ఓం బిర్లాపై వీగిన అవిశ్వాస తీర్మానం
పానిపట్ లోఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభలు రేపటినుండే!
సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం