జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై అసెంబ్లీలో ఓ ప్రకటన చేస్తూ1.5 ఉన్న టీఎఫ్ఆర్ను 2.1కు తీసుకెళ్లటం మన లక్ష్యమని వెల్లడించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేం ఛేంజర్ కానుందని భావిస్తున్నామని వెల్లడించారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీకి అర్హత లేదనే చట్టం రద్దు చేశామని, ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హుల్ని చేయాల్సి వస్తుందేమోనని తెలిపారు. పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ కేర్ దిశగా వెళ్తున్నామని చెప్పారు.
మాతృత్వ, శక్తి, నైపుణ్య, క్షేమ, సంజీవని అనే 5 అంశాలు తీసుకున్నామని అలానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించాలని చెప్పారు. 90 లక్షల మంది జంటల్లో 11 లక్షల మంది ఇన్ఫెర్టిలిటి సమస్యతో ఉన్నారని, 11 లక్షల మంది సంతాన సాఫల్యానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే సుస్థిర ప్రగతి ఉంటుందని అలానే దీనికంటే ఎక్కువగా ఉంటే జనాభా కొంత పెరుగుతుందని తెలిపారు.
జపాన్లో 1.2, సౌత్ కొరియాలో 0.7 టీఎఫ్ఆర్ మాత్రమే ఉందని దీనివల్ల జనాభా తగ్గి మానవ వనరులు తగ్గిపోతాయని వెల్లడించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ 8.80 శాతం ఉందని దీన్ని 3 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. పనిచేసే మహిళల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, పిల్లలకు బేబీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఇంక భార్య మూడో కాన్పు ఉంటే భర్తకు 2 నెలలు సెలవు ఇస్తామని వెల్లడించారు. మహిళతో పాటు భర్త కూడా పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడాలని చెప్పారు.
60 ఏళ్లు దాటిన వారు కూడా పని చేసుకునే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రిటైర్ కాబోయే 50 వేల మంది ఉద్యోగులను గుర్తించి ఆరోగ్య సంరక్షణపై శిక్షణ ఇస్తామని తద్వారా వారు రిటైరైన తర్వాత కూడా ఏదైనా పని చేసి సంపాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. చైల్డ్ కేర్ విభాగాన్ని విస్తరిస్తున్నామని 10 వేల మంది సర్టిఫైడ్ కేర్ టేకర్స్ని సిద్ధం చేస్తామని సీఎం వెల్లడించారు.

More Stories
మార్చి 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై ‘మహా కుంభాభిషేకం’
తిరుమల లడ్డూపై చర్చలో తీవ్ర గందరగోళం
కల్తీ నెయ్యిపై రంగంలోకి దిగిన ఏకసభ్య కమిషన్