కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఓ వర్సిటీ నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రైవేటు యూనివర్సిటీ గల్గోటియాస్ ఏఐ సదస్సులో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అందులో ‘ఓరియన్’ పేరిట రూపొందించిన రోబో డాగ్‌ను ప్రదర్శించింది. దాన్ని తమ వర్సిటీలోనే అభివృద్ధి చేసినట్లు వర్సిటీ ప్రతినిధి మీడియాకు తెలిపారు.
ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలాంటి రోబో డాగ్‌నే చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. దాని ఖరీదు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంది. ఆ రోబోడాగ్‌ను ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. భారత్‌లోనూ వాటిని విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
విదేశీ సాంకేతికతను తమ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్టాల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్వాహకులు వర్సిటీని ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. స్టాల్‌లో ఉన్న తమ ప్రతినిధి అవగాహనా రాహిత్యం వల్లే ఈ గందరగోళం ఏర్పడినట్లు తెలిపింది. ఆ రోబో డాగ్‌ను చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నామని వెల్లడించింది.
‘‘ఏఐ సదస్సులో గందరగోళం నెలకొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాం. మా ప్రతినిధి ఒకరు అవగాహనా రాహిత్యంతో మాట్లాడారు. ఆమెకు రోబోడాగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాల గురించి అవగాహన లేదు. కెమెరా ముందు అత్యుత్సాహంతో మాట్లాడుతూ తప్పుడు సమాచారం ఇచ్చింది. ఆ ఆవిష్కరణ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయాలన్న ఉద్దేశం మాకు లేదు’’ అని వర్సిటీ అధికార ప్రతినిధి తెలిపారు.
దానికి కేటాయించిన స్టాల్‌ను అధికారులు ఖాళీ చేయించారు. ఈ వివాదం నేపథ్యంలోనే దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన సాకర్ డ్రోన్‌ను తమ యూనివర్సిటీలోనే అభివృద్ధి చేశామంటూ గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నది. భారత్‌లో మొట్టమొదటి డ్రోన్ సాకర్ అరేనాను తమ క్యాంపస్‌లోనే అభివృద్ధి చేసినట్లు ఆమె వెల్లడించారు.
దీనికి సిమ్యులేషన్ ల్యాబ్, అప్లికేషన్ అరీనా ఉన్నాయని, తమ క్యాంపస్‌లోనే దీని ఉత్పత్తిని మరింత మెరుగైన లక్షణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే సాకర్ డ్రోన్ చుట్టూ గుండ్రటి ఆకృతి పంజరం మాదిరిగా ఉంటుంది. అయితే ఇది దక్షిణ కొరియాకు చెందిన హెల్సెల్ గ్పూ అభివృద్ధి చేసిన సాకర్ డ్రోన్‌ను పోలి ఉన్నట్లు నెటిజన్లు విమర్శించడం గమనార్హం.
స్కైబాల్‌డ్రోన్.కాంలో స్ట్రైకర్ వీ3 ఏఆర్‌ఎఫ్ ప్రొఫెషనల్ డ్రోన్ సాకర్ సెట్ అందుబాటులో ఉంది. ఇది సుమా రు 453 డాలర్లు(రూ. 40,800) ఖరీదు చేస్తుంది. దీన్ని డ్రోన్ సాకర్ అనే ఆటలో ఉపయోగిస్తారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండోర్ టీమ్ గేమ్.
కాగా, బుధవారం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ స్పందిస్తూ సదస్సులో ఎవరైనా ఇతరులు తయారు చేసిన వస్తువులను తాము అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. సరైన ప్లానింగ్ లేకుండా, చైనా వస్తువుల గురించి కూడా ప్రచారం చేసుకుంటున్నారంటూ కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు.
ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఏ మాత్రం మేధస్సే లేని వారు కృత్రిమ మేధ గురించి రెడీమేడ్ ట్వీట్‌లు పోస్ట్ చేయకూడదని రాహుల్‌ని తీవ్రంగా విమర్శించింది. ప్రపంచ వేదికలపై భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తున్న సమయంలో దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే రాహుల్ పనిగా పెట్టుకొంటారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ధ్వజమెత్తారు.

More Stories
కర్రెగుట్టల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి!
కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం
చంచల్‌గూడ జైలు నుంచి పాకిస్థాన్‌కు ఫోన్ కాల్స్!