బంగ్లాదేశ్ లో జమాత్‌ని దెబ్బతీసిన అమెరికాతో సంబంధాలు!

బంగ్లాదేశ్ లో జమాత్‌ని దెబ్బతీసిన అమెరికాతో సంబంధాలు!
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని  బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయాన్నిఅందుకోగా మతఛాందసవాద పార్టీ జమాతే ఇస్లామీకి మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ 77 సీట్లతో సరిపెట్టుకుంది. బంగ్లాదేశ్ ఎన్నికలకు కొన్ని వారాల ముందు జమాతే ఇస్లామ్ మంచి ఫలితాలను సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. 
 
ఆ దేశ స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ఆ పార్టీ మెరుగైన ప్రదర్శన గురించి రాజకీయ పరిశీలకులు బహిరంగంగా మాట్లాడారు. జమాతే కేవలం పోటీకీ మాత్రమే పరిమితం కాదని, ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని భావించారు. కానీ, చివరకు ఎన్నికల ఫలితాలు జమాతేను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ ఫలితాల సమగ్రత గురించి తమకు అనుమానాలు ఉన్నాయని జమాతే ఇస్లామీ వ్యాఖ్యానించింది.
 
ప్రజలు ఏకపక్షంగా బీఎన్పీకి విజయాన్ని కట్టబెట్టడంతో తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై 2024లో విద్యార్థులు చేపట్టిన ఉద్యమంతో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కరడుగట్టిన ఇస్లామిక్ పార్టీ  జమాతే ఇస్లామీ సంస్థాగతంగా బలపడింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. 
 
అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. ఎన్నికల రేసులోకి తారిక్ రెహమాన్ ఆలస్యంగా ప్రవేశించడం కూడా జమాతేకు కలిసొచ్చినట్టు కనిపించింది. కానీ, ఇది తాత్కాలికమేనని తాజా ఫలితాలతో రుజువయ్యింది.

తనవైపు ఉంటారని జమాత్ ఆశించిన వర్గాలు ప్రచారం మొదలైన తర్వాత బీఎన్పీ వైపు మళ్లాయి. హసీనా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బంగ్లాదేశ్ యువతలో ఎక్కువ శాతం బీఎన్పీకి అండగా నిలవడం విశేషం. జమాతే ఇస్లామీ నాయకత్వం ఊహించినంతగా మహిళా ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. హిందువులతో సహా మైనారిటీ వర్గాలు కూడా బిఎన్పీకి మద్దతుగా నిలిచాయి. ఇక, అవామీ లీగ్ ఓట్లు సైతం బీఎన్పీకి మళ్లాయి.
జమాతే పార్టీతో అమెరికా దౌత్యవేత్తలు సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఎన్నికలకు ముందు ఓ సంచలన నివేదిక ప్రచురించింది. దీంతో జమాతేపై వ్యతిరేక ప్రచారం మొదలైంది. దౌత్యవేత్తలతో సంభాషణలను ఆ వార్తాపత్రిక ఉదహరించింది. 
 
జమాత్ ఇస్లామిక్ చట్టం విధించడానికి ప్రయత్నిస్తుందనే ఆందోళనలను అమెరికా దౌత్య అధికారి తోసిపుచ్చారని నివేదిక తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ఎన్నికల ప్రచారం స్వభావాన్నే మార్చేసి, నిశ్శబ్దంగా ప్రజలను చేరుకుంది  ఠాకూర్‌గావ్‌లో జరిగిన రోడ్‌షోలో సీనియర్ బిఎన్పీ నేత, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలమ్‌గిర్ అమెరికాతో జమాతే ఇస్లామ్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
 
అలాంటి ఒప్పందం బంగ్లాదేశ్ శాంతి, స్థిరత్వం, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.  ఈ ఆరోపణలపై జమాత్ స్పందించకపోగా దౌత్యపరమైన చర్చలను కొనసాగించింది. ఎన్నికలకు ముందు విదేశీ రాయబారులతో సమావేశాలను పార్టీ సాధారణ చర్చలుగా పేర్కొంది.

పాశ్చాత్య దౌత్యవేత్తలతో సమావేశం తర్వాత ఓ ప్రకటన విడుదల చేసిన జమాతే ‘‘చర్చలు చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, ఆమోదయోగ్యమైన ఎన్నికల నిర్వహణ, పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించాం’’ తెలిపింది. ఇది జమాతే పట్ల బంగ్లా పౌరుల్లో మరింత వ్యతిరేకత కలిగించింది.